సొనూసూద్ సహాయం చేస్తే పవన్ మీద ఏడుపెందుకు !

pawan kalyan sonu sood
సోషల్ మీడియాలో వైసీపీ కార్యకర్తలు, అభిమానులుగా చలామణీ అయ్యే కొన్ని గ్రూపులు, వ్యక్తులు విచ్చలవిడిగా రెచ్చిపోతున్నారు.  పార్టీ పెద్దల అండ ఉందనే ధైర్యమో, తమకి చట్టాలు వర్తించవనే ధీమానో తెలీదు కానీ తరచూ వికృత చేష్టలతో, వక్రపు అభిప్రాయాలతో ఇదేం పైత్యం నాయనా అనుకునేలా ప్రవర్తిస్తున్నారు.  అయినదానికి కానిదానికి ప్రత్యర్థి పార్టీల నాయకులను టార్గెట్ చేసి మతి లేని విమర్శలు గుప్పిస్తున్నారు.  సమస్యలకు బాధ్యత వహించాల్సిన ప్రభుత్వాన్ని పక్కబెట్టి అధికారం లేని వ్యక్తుల్ని పట్టుకుని అది చేయలేదు, ఇది చేయలేదు అంటూ నాసిరకం మాటలు మాట్లాడుతున్నారు. 
 
నిన్న బాలీవుడ్ నటుడు సొనూసూద్ చిత్తూరు జిల్లాకు చెందిన ఒక రైతు పొలం దున్నడానికి ఎద్దులను అద్దెకు తీసుకునే ఆర్థిక స్థోమత లేక తన ఇద్దరు కూతుళ్లను నాగలి కాడికి చెరో వైపు పట్టించి పొలం దున్నుతున్న వీడియోను ఒక జర్నలిస్ట్ సోషల్ మీడియాలో ఉంచాడు.  దాన్ని చూసి స్పందించిన సొనూసూద్ వెంటనే వారికి ఒక కొత్త ట్రాక్టర్ కొనిచ్చి ఆదుకున్నాడు.  ఈ సహాయం చేసినందుకు గాను సొనూసూద్ ను తప్పకుండా అభినందించాల్సిందే.  అందరూ అదే చేశారు.  కానీ అధికార పార్టీ అభిమానులు కొంచెం తేడా కదా అందుకే సొనూసూద్ సహాయాన్ని వక్ర కోణంలో తీసుకున్నారు. 
 
బాలీవుడ్ హీరో ఇలా మన రాష్ట్రంలోని రైతుకు సహాయం చేస్తే పవన్ కళ్యాణ్ ఏం చేస్తున్నాడు అంటూ వెర్రి రచ్చ షురూ చేశారు.  పవన్ కళ్యాణ్ యొక్క స్పందించే గుణం ఎలాంటిదో అందరికీ తెలుసు.  ఆయన చేతుల మీదుగా ఎంతమంది సహాయం పొందారో లెక్కలేదు.  లాక్ డౌన్ సమయంలో జనసేన కార్యకర్తలు సొంత డబ్బుతో ఎన్నో సేవా కార్యక్రమాలు చేశారు.  సొంత ఖర్చులతో విమానం బుక్ చేసి విదేశాల్లో చిక్కుకున్న వారిని ఇండియాకు తీసుకొచ్చారు.  అలాంటి వ్యక్తిని పట్టుకుని సహాయం చేయలేదు ఎందుకని అడగడం మూర్ఖత్వమే అవుతుంది.  
 
నిజానికి అధికార పార్టీ హోదాలో ఉన్న వైసీపీ రాష్ట్రంలో రైతు ఆ దుస్థితిలో ఉంటే ఏం చేస్తోంది అని స్వీయ విమర్శ చేసుకుని వైసీపీని వెనకేసుకొచ్చేవారు తలలు దించుకోవాలి.  రాష్ట్రంలో రైతు అనే వాడు ఏ మూలనున్నా అతనికి సంక్షేమ ఫలాలు అందుతాయని గొప్పలు చెప్పిన ప్రభుత్వానికి కూతుళ్లతో పొలం దున్నిస్తున్న ఆ రైతు కష్టాన్ని చూపించి గ్రౌండ్ లెవల్లో సిట్యుయేషన్ ఇది అని తలంటాలి.  కానీ అవేవీ చేయకుండా పవన్ మీద పడి ఏడవడం వారి భావ దారిద్ర్యానికి నిదర్శనం.