YCP MP’s : ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలోనే కాదు, పార్లమెంటులోనూ మన ఆంధ్రప్రదేశ్ రాజకీయ నాయకులు బూతులు తిట్టుకున్నారట. ఇదెక్కడి చోద్యం.? అసలు, ఇందులో నిజమెంత.?
విషయమేంటంటే, వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణరాజు, వైసీపీకి చెందిన లోక్ సభ సభ్యుల మీద తీవ్రస్థాయి ఆరోపణలు చేశారు. లోక్ సభలో తాను మాట్లాడుతున్న సమయంలో వైసీపీ ఎంపీలు తనను బూతులు తిట్టారన్నది రఘురామ ఆరోపణ. ఈ మేరకు రఘురామ, ప్రధాని నరేంద్ర మోడీకి ఫిర్యాదు చేశారట. లోక్ సభ స్పీకర్‌కి కూడా ఫిర్యాదు చేయబోతున్నారట.
మొన్నీమధ్యనే ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధినేత, ప్రతిపక్ష నేత నారా చంద్రబాబునాయుడిపై వైసీపీకి చెందిన శాసన సభ్యులు అసభ్యకర పదజాలం వాడారనీ, చంద్రబాబు సతీమణి భువనేశ్వరిపై కూడా అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారనీ పెద్ద దుమారం చెలరేగింది.
చంద్రబాబు రాసిచ్చిన స్క్రిప్టుని ఫాలో అయ్యారో ఏమో, రఘురామ తన మీద వైసీపీ ఎంపీలు బూతులు ప్రయోగించారంటూ యాగీ చేస్తున్నారు. ఇంకా నయ్యం, చంద్రబాబులా రఘురామకృష్ణరాజు మీడియా ముందు ఏడ్చేయలేదు.
రాజధాని అమరావతి కోసం రైతులు చేస్తున్న పాదయాత్రకు ప్రభుత్వం అడ్డంకులు సృష్టిస్తోందన్నది నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు ఆరోపణ. ఈ ఆరోపణల్ని ఆయన పార్లమెంటు సాక్షిగా చేశారు. దాంతో, వైసీపీ ఎంపీలు ఆగ్రహం వ్యక్తం చేసిన మాట వాస్తవం. అంతమాత్రాన వైసీపీ ఎంపీలు బూతులు తిట్టారని అనగలమా.?
చట్టసభల్లో ప్రతి మాటా రికార్డ్ అవుతుంది. సో, రఘురామ తన ఆరోపణలకు సంబంధించి ఆధారాలు బయటపెట్టాల్సి వుంది.