YCP Minister : బ్రహ్మదేవుడు దిగొచ్చినా వైఎస్ జగన్‌ని జైలుకు పంపలేరట.!

YCP Minister : వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని జైలుకు పంపించడం పెద్ద కష్టమైన వ్యవహారమేమీ కాదు ఈ రోజుల్లో. అక్రమాస్తుల కేసులో ఆయన్ని జైలుకు పంపి ఏం సాధించినట్లు.? కాంగ్రెస్ హయాంలో కక్ష సాధింపు రాజకీయాలకు నిదర్శనం వైఎస్ జగన్ అరెస్ట్. ఆ కేసు ఇప్పటికీ అలా అలా సాగుతూనే వుంది. చాలా చార్జిషీట్లు దాఖలయ్యాయి. ఇదిగో జగన్ జైలుకెళతారు.. అదిగో జగన్ జైలుకెళతారంటూ ఎప్పటికప్పుడు ప్రచారం జరుగుతూనే వుంది.

నిజానికి, ‘వైఎస్ జగన్ జైలుకెళ్ళాల్సిందే..’ అంటూ విపక్షాలు చేసే విమర్శలు, వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి ఆశీర్వాదాలుగా పనిచేస్తున్నాయనుకోవాలేమో. ‘అసలు వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని ఎందుకు జైలుకు పంపించాలి.? ఏళ్ళ తరబడి విచారణ కొనసాగుతోంది. దోషిగా ఇంతవరకూ ఆయన్ని నిరూపించలేకపోయారు. అలాంటప్పుడు, జైలుకు పంపిస్తామనడమేంటి.?’ అంటూ వైఎస్ జగన్ మద్దతుదారులు ప్రశ్నిస్తున్నారు. ఇదే వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి సానుభూతిని తెచ్చిపెడుతోంది.

తాజాగా మంత్రి నారాయణస్వామి, వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. ప్రజల ఆశీస్సులు, దేవుడి ఆశీస్సులు వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి వున్నాయనీ, వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని జైలుకు పంపడం ఎవరి తరమూ కాదంటూ, బీజేపీ నేతల్ని ఉద్దేశించి, ‘మిమ్మల్ని పుట్టించిన బ్రహ్మతరం కూడా కాదు..’ అంటూ ఘాటైన వ్యాఖ్యలు చేశారు.

బ్రహ్మ దాకా అవసరం లేదు. వైసీపీ – బీజేపీ మధ్య రాజకీయ వైరం.. ముదిరి పాకాన పడితే, కక్ష సాధింపు చర్యలు షురూ అవుతాయి. అదే జరిగితే వైఎస్ జగన్ జైలుకు వెళ్ళడం ఖాయం. కానీ, కాంగ్రెస్ తరహాలో బీజేపీ తప్పు చేస్తుందా.? అన్నదే మిలియన్ డాలర్ల ప్రశ్న.