వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడాయన. ఉత్తరాంధ్రలో బలమైన సామాజిక వర్గానికి ప్రతినిథిగా కూడా ఆయన గురించి చెప్పుకుంటుంటారు. బలం, బలగం విషయంలో ఆయనకు ఆయనే సాటి. తన కుటుంబంలోనే బోల్డంతమంది ప్రజా ప్రతినిథులుండేవారు.. అలా ఆయన తన కుటుంబం నుంచి చాలామందిని రాజకీయాల్లోకి తీసుకొచ్చారు.. నిలబెట్టారు. ఆయనే బొత్స సత్యనారాయణ. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో ఇప్పుడాయన సీనియర్ నేత.. మంత్రి కూడా. వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మనసెరిగి మంత్రిగా తన బాధ్యతలు నిర్వహిస్తున్న బొత్స సత్యనారాయణ, అమరావతి వివాదంలో తనదైన స్టయిల్లో వ్యాఖ్యలు చేసి.. హాట్ టాపిక్ అవుతూ వచ్చారు.
అయితే, ఇప్పుడాయన వైసీపీలో కొందరికి టార్గెట్ అయ్యారట. మంత్రి పదవి నుంచి ఆయన్ని తప్పించే అవకాశముందనే ప్రచారం జరుగుతోంది. కాదు కాదు, తనంతట తానుగా మంత్రి పదవి నుంచి తప్పుకుని, రాజ్యసభకు వెళ్ళాలనుకుంటున్నట్లు బొత్స, ముఖ్యమంత్రి వద్ద ప్రస్తావించారంటున్నారు. ఇవేవీ కాదు, బొత్స సహా, ఆయన సన్నిహితులందరి ప్రాపకం వైసీపీలో తగ్గించేందుకు విజయనగరం జిల్లా వైసీపీలో కొందరు, అలాగే ఉత్తరాంధ్ర వైసీపీ ముఖ్య నేతలు కొందరు ప్రయత్నిస్తున్నారనే ఊహాగానాలూ వినిపిస్తున్నాయి. ఈ వ్యవహారాలపై మంత్రి బొత్స సత్యనారాయణ ఇప్పటికే ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి ఫిర్యాదు చేశారనే ప్రచారమూ తెరపైకొచ్చింది. రెండేళ్ళ పాలన పూర్తయిన దరిమిలా, వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి ఇలాంటి తలనొప్పులు సర్వసాధారణమే. ఇదే అసలు సిసలు కఠిన పరీక్ష వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి. విపక్షాలు వెదజల్లే రాజకీయ బురద కడుక్కోవడం అంతతేలిక కాదు. పైగా, బొత్స సత్యనారాయణ అంటేనే అధికారం ఎటువైపుంటే అటువైపు దూకేసే వ్యక్తి అన్న ప్రచారముంది. ఏమో, రాజకీయాల్లో ఏదైనా జరగొచ్చు.