అధికార పార్టీ వైసీపీకి చెందిన నేత నుండి మా ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి గాడిదలు కాస్తున్నాడు అనే మాట రావటం నిజంగా షాకింగ్ కి గురి చేసే విషయం అనే చెప్పాలి. అయితే దీని వెనుక ఒక బలమైన కారణం ఉండటమే ఆ నేత తమ అధినేత గురించి అలాంటి కామెంట్ చేయవలసి వచ్చింది.
వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లేళ్ల అప్పిరెడ్డి మాట్లాడుతూ మా ముఖ్యమంత్రి గాడిదలే కాస్తున్నాడు అంటూ వ్యాఖ్యలు చేశాడు . టీడీపీ యువనేత నారా లోకేష్ ట్విట్టర్ లో అనేకసార్లు ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి పై అనేక విమర్శలు గుప్పిస్తుంటాడు. ఈ నేపథ్యంలో ఇటీవల ముఖ్యమంత్రిపై లోకేశ్ అవాకులు చెవాకులు పేలారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌రెడ్డి గాడిదలు కాస్తున్నారా? అని లోకేశ్ ప్రశ్నించారు.
వైసీపీ నేత అప్పిరెడ్డి మీడియాతో మాట్లాడుతూ వైఎస్ జగన్ ప్రమాణ స్వీకారం చేసిన నాటి నుంచి రాష్ట్రంలో బరి తెగించి తిరుగుతున్న రెండు పెద్ద అడ్డ గాడిదలను కాస్తున్నారన్నారు. వాటిలో ఒకటి చంద్రబాబు , రెండోది లోకేశ్ అని ఎద్దేవా చేశారు. ఈ రెండు అడ్డగాడిదల నుంచి రాష్ట్రాన్ని జగన్ కాపాడుతున్నారని ఆయన చెపుతూ, లోకేష్ మీద నిప్పులు చెరిగాడు.
దుష్ప్రచారం, అవాస్తవాలు, అబద్ధాలు, కులాలు, మతాలు ప్రాంతాల పేరుతో నీచ రాజకీయాలు చేస్తున్న చంద్రబాబు, లోకేశ్ లాంటి రెండు గాడిదల నుంచి ప్రజలను రక్షించేందుకు తమ ప్రభుత్వం కాపలా కాస్తోందని అప్పిరెడ్డి చమత్కరించారు. ముఖ్యమంత్రి గాడిదలు కాస్తున్నాడా..? అంటూ లోకేష్ అడిగిన ప్రశ్నకు దిమ్మతిరిగే సమాధానం ఇచ్చిన అప్పిరెడ్డిని వైసీపీ శ్రేణులు సోషల్ మీడియాలో ఆకాశానికి ఎత్తుతున్నారు.