గుంటూరు సమీపంలోనినల్లపాడు వద్ద స్థానిక సంస్థల ఎన్నికల ముగింపు వేళ అర్ధరాత్రి దాటిన తర్వాత తీవ్ర ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఎన్నికల ముగింపు ప్రక్రియలో భాగంగా బ్యాలెట్ బాక్సులను తరలించే క్రమంలో జరుగుతున్న అక్రమాలను ప్రశ్నించినందుకు, నిరసన తెలిపినందుకు వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. స్థానిక సంస్థల ఎన్నికల పోలింగ్ ముగిసిన అనంతరం గురువారం రాత్రి వెంగళాయపాలెం నుంచి బ్యాలెట్ బాక్సులను స్ట్రాంగ్ రూమ్‌కు తరలిస్తుండగా ఈ వివాదం మొదలైంది.
రవాణా సమయంలో నల్లపాడు సెంటర్ వద్ద ఒక ఎన్నికల అధికారి నిబంధనలకు విరుద్ధంగా బ్యాలెట్ బాక్స్‌ను వాహనం నుంచి దించి పక్కకు తీసుకెళ్లడంపై అక్కడ ఉన్న వైసీపీ అభ్యర్థులు, నాయకులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఓట్లను మార్చేందుకు లేదా అధికార పక్షానికి అనుకూలంగా అక్రమాలకు పాల్పడుతున్నారనే అనుమానంతో వారు ఆ అధికారిని నిలదీసి అడ్డుకున్నారు. ఎన్నికల ప్రక్రియలో జరుగుతున్న ఈ అక్రమాలకు నిరసనగా ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి నేతృత్వంలో పార్టీ కార్యకర్తలు నల్లపాడు సెంటర్లో రోడ్డుపై బైఠాయించి ధర్నాకు దిగారు.
బ్యాలెట్ బాక్సుల రక్షణ కోసం వారు ఆందోళన చేపట్టడంతో గుంటూరు-నల్లపాడు మార్గంలో ట్రాఫిక్ స్తంభించింది. అయితే, క్షేత్రస్థాయిలో జరిగిన అక్రమాలపై చర్యలు తీసుకోవాల్సింది పోయి.. నిబంధనల ఉల్లంఘనను ప్రశ్నించిన ఎమ్మెల్సీ అప్పిరెడ్డి మరియు వైసీపీ నాయకులపైనే పోలీసులు విధులకు ఆటంకం కలిగించారంటూ కేసు నమోదు చేశారు. అర్ధరాత్రి 2:30 గంటల ప్రాంతంలో ఆయనను బలవంతంగా అదుపులోకి తీసుకుని నల్లపాడు పోలీస్ స్టేషన్‌కు తరలించడంతో వైసీపీ శ్రేణులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.