వైఎస్ జగన్ సర్కారు ‘మటర్ మార్ట్’ ఐడియా అదిరిందిగానీ.!

చిత్ర విచిత్రమైన ఆలోచనల్ని చేస్తోంది వైఎస్ జగన్ సర్కార్. ఇంటి వద్దకే రేషన్.. అంటూ రేషన్ వాహనాల్ని ఇప్పటికే అందుబాటులోకి తెచ్చారు. ఇప్పుడేమో మటన్ మార్ట్.. అంటూ కొత్త ఆలోచన చేసింది వైఎస్ జగన్ సర్కార్. నాణ్యమైన మటన్.. మాంసాహార ప్రియులకు అందించేందుకు వైఎస్ జగన్ సర్కార్ ఈ సరికొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. నిజానికి, అభినందించాల్సిన విషయమే ఇది. కానీ, చిన్నా చితకా మటన్ దుకాణాల పరిస్థితేంటి.? వాటినే జీవనాధారంగా చేసుకుని జీవిస్తున్నవారి భవిష్యత్తేంటి.? ఈ ప్రశ్న ఇప్పుడు మటన్ దుకాణాల్ని నిర్వహిస్తున్నవారిలో గుబులు రేపుతోంది. ముందు ముందు చికెన్ మార్ట్.. ఫిష్ మార్ట్.. వంటి ఆలోచనల్ని కూడా జగన్ సర్కార్ చేస్తుందన్నది నిర్వివాదాంశం.

వీటి సంగతెలా వున్నా, రైతులు తమ వ్యవసాయ ఉత్పత్తుల్ని విక్రయించుకునేందుకు వీలుగా ‘వెజిటబుల్ మార్ట్’ అందుబాటులోకి తెస్తే అది మరింత లాభదాయకంగా వుంటుంది మటన్ మార్ట్.. చికెన్ మార్ట్.. వంటివాటితో పోల్చితే. ప్రైవేటు వ్యవహారాల్ని ప్రభుత్వం తన బాధ్యతగా తీసుకోవడం పట్ల భిన్నవాదనలు వ్యక్తమవుతున్నాయి. సినిమా టిక్కెట్లను ప్రభుత్వ వెబ్‌సైట్ ద్వారా విక్రయించేందుకు వైఎస్ జగన్ సర్కార్ ఇప్పటికే నిర్ణయం తీసుకున్న విషయం విదితమే. ఇదిలా వుంటే, మద్యం షాపుల వద్దకు మటన్ మార్ట్‌లను తీసుకెళ్ళి మందుబాబులకు మేలు చేయదలచుకున్నారా.? అంటూ విపక్షాలు వెకిలి ప్రశ్నలు సంధిస్తున్నాయి. విపక్షాల విమర్శల సంగతి పక్కన పెడితే, మటన్ మార్ట్ అనే ఆలోచన ద్వారా కొంతమందికి మెరుగైన ఉపాధి లభిస్తుంది. చాలామందికి నాణ్యమైన మటన్ లభిస్తుంది. కానీ, చాలామంది జీవితాలు రోడ్డున పడిపోతాయి.