విద్యార్థుల ర్యాంకుల్ని ప్రచారం చేసుకుంటే ఏడేళ్ళ జైలు శిక్ష

YCP Govt

వైసీపీ సర్కారు ఏ నిర్ణయం తీసుకున్నా అది వివాదాస్పదమవుతూ వుంటుంది. చాలా అరుదుగా మాత్రమే. ప్రభుత్వ నిర్ణయాలకు సానుకూల స్పందన వస్తుంటుంది. అలాంటి అరుదైన నిర్ణయాల్లో ‘పదో తరగతి పరీక్షలకు సంబంధించి ర్యాంకుల్ని విద్యా సంస్థలు ప్రకటించకూడదు.. పబ్లిసిటీ చేసుకోకూడదు’ అనే నిర్ణయం అత్యంత ప్రత్యేకమైనది.

మా విద్యా సంస్థలో చదివారు గనుకనే బెస్ట్ ర్యాంక్స్.. అంటూ పరీక్షా ఫలితాలు రాగానే, వివిధ విద్యా సంస్థలు ర్యాంకుల పేరుతో ప్రకటనలు గుప్పించేస్తుంటాయి. తద్వారా తమ విద్యా సంస్థల్లోకి అడ్మిషన్లు పెంచుకోవాలన్నది ఆయా విద్యా సంస్థల యాజమాన్యాల ఆలోచన.

పదో తరగతి పరీక్షా ఫలితాలు రాకుండానే ఇంటర్మీడియట్ అడ్మిషన్లు చాలావరకు జరిగిపోయాయంటే, విద్యా వ్యవస్థ ఎంతలా నాశనమైపోతోందో అర్థం చేసుకోవచ్చు. ఆరో తరగతి నుంచే ఐఐటీ ఫౌండేషన్.. అంటూ రకరకాల పేర్లతో విద్యార్థుల మెదళ్ళను పీల్చి పిప్పి చేసేస్తున్నాయి కొన్ని విద్యా సంస్థలు. కొన్ని కాదు, దాదాపు అన్ని విద్యా సంస్థలదీ అదే తీరు.

ఈ రేసులో నారాయణ, శ్రీ చైతన్య ముందుంటున్నాయి. వీటి దోపిడీకి అడ్డుకట్ట వేయడం ప్రభుత్వాలకు సాధ్యం కావడంలేదు. వీటిల్లో పెట్టబుడులు పెట్టేది మళ్ళీ రాజకీయ పార్టీలకు చెందిన నేతలే. అన్ని రాజకీయ పార్టీలకూ వీటిల్లో వాటాలు వుంటున్నాయి.

మొత్తమ్మీద, ర్యాంకుల పేరుతో పబ్లిసిటీ స్టంట్లకు దిగితే 3 లక్షల నుంచి 7 ఏళ్ళ వరకు జైలు శిక్ష, లక్ష రూపాయల వరకు జరీమానా.. అంటూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జారీ చేసిన ఆదేశాల్ని అభినందించి తీరాల్సిందే. అయితే, మాఫియాకి అలవాటుపడ్డ విద్యా సంస్థలు, ప్రభుత్వాన్ని లెక్క చేస్తాయా.? అన్నదే ప్రశ్న.