కుప్పం లో దంచుతున్నారు – చంద్రబాబు కంచుకోటలో వైసీపీ బ్లాక్ బస్టర్ ?

ap cm ys jagan and tdp president chandrababu

ఏపీలో కుప్పం పేరు ఇపుడు మరో మారు మారుమోగుతోంది. కుప్పం అనగానే అందరికి ఠక్కున గుర్తుకువచ్చేది చంద్రబాబు. మూడు దశాబ్దాలుగా చంద్రబాబు అక్కడ ఎమ్మెల్యేగా ఉన్నారు. కుప్పాన్ని టీడీపీకి కంచుకోట చేసిన ఘనత కూడా ఆయనకే దక్కుతుంది. అటువంటి కుప్పంలో ఇపుడు మూడవ విడత పంచాయతీ ఎన్నికలు జరుగుతున్నాయి.గత సార్వత్రిక ఎన్నికల్లో కుప్పంలో ఎమ్మెల్యేగా పోటీ చేసిన చంద్రబాబు మెజారిటీని సగానికి సగం తగ్గించిన వైసీపీ ఇపుడు మరింత జోరు పెంచింది.

tdp ycp
tdp ycp

టీడీపీకి గట్టిగా ఉన్న ప్యాకెట్లను చూసి మరీ టార్గెట్ చేసింది. టీడీపీ నుంచి పెద్ద ఎత్తున నాయకులను అధికార పార్టీలోకి లాగేశారు. ఇందులో మూడు దశాబ్దాలుగా బాబుతో అనుబంధం ఉన్న నాయకులు కూడా ఉన్నారు. ఇవన్నీ పక్కన పెడితే కుప్పం ముఖం చంద్రబాబు చూసి ఏడాది పైగా దాటిపోయిందని అంటున్నారు. ప్రతీ ఏటా సంక్రాంతి సంబరాలకు చిత్తూరు వెళ్ళే బాబు పనిలో పనిగా కుప్పం కూడా వెళ్తూ వచ్చేవారు. ఈసారి కరోనా కారణంగా ఆయన అటువైపు చూడలేదు, ఇక తనయుడు లోకేష్ సైతం కుప్పానికి వెళ్ళలేదు.

దాంతో వైసీపీకి అది మంచి అదనుగా అనిపించింది. దాంతో వైసీపీ నేతలు గట్టిగానే పట్టు పడుతున్నారు. కుప్పం కంచుకోటను టీడీపీకి కాకుండా చేయాలని తపన పడుతున్నారు. అయితే కుప్పంలో ఏకగ్రీవాలు పెద్ద ఎత్తున చేయాలనుకున్న వైసీపీకి టీడీపీ గట్టిగానే జవాబు చెప్పింది. టీడీపీ నుంచి బాగానే నామినేషన్లు పడ్డాయి. అన్ని చోట్లా పంచాయతీలకు నామినేషన్లు వేయడంతో టీడీపీ సక్సెస్ అయింది. కానీ ఇపుడు ఇందులో ఎందరు గెలుస్తారు అన్నదే పెద్ద ప్రశ్న ఉంది. చూడాలి మరి మూడవ విడతలో కుప్పం ఎవరికి పట్టం కడుతుందో.