వైయస్ జగన్ మొండివాడ ? వ్యూహకర్తా ??

YS Jagan decision on antarvedi incident

రాష్ట్ర ప్రజానీకం వైయస్ జగన్ కి కనీవినీ ఎరుగని రీతిలో గడిచిన సార్వత్రిక ఎన్నికల్లో ఒక గొప్ప విజయాన్ని అందించారు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రజలు. వైయస్ జగన్ ముఖ్యమంత్రి అయినప్పటి నుండి అనేక సంక్షేమ పథకాలు అమల్లోకి తెచ్చినప్పటికీ చాలా కీలకమైన నిర్ణయాల్లో మాత్రం అడ్డంకులు ఎదుర్కొంటున్నారు. ఉదాహరణకి మూడు రాజధానులు, ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ విద్య, అమరావతిలో పేదలకు భూ పంపిణీ, అమరావతి ఇన్సైడర్ ట్రేడింగ్ మీద కేసులు  నమోదు ఇలాంటి అనేక విషయాల్లో వైయస్ జగన్ కి కోర్టుల రూపంలో లో అడ్డంకులు ఎదురవుతున్నాయి.

YS Jagan ready for a fight with High court

న్యాయస్థానాల  తీర్పు మీద ఇంతగా సామాన్య ప్రజానీకంలో గతంలో ఎప్పుడు  చర్చ జరగలేదు. స్వర్ణ ప్యాలెస్ అగ్నిప్రమాదంలో డాక్టర్ రమేష్ మీద విచారణ వద్దని కోర్టు తీర్పు ఇవ్వడం చాల మందికి ఆశ్చర్యం కలిగించింది. సామాన్య ప్రజానీకం రచ్చబండ దగ్గర కోర్టు తీర్పుల మీద చర్చ చేసే స్థాయికి తీసుకెళ్ళింది. ఇదే కోవలో నిన్న ప్రభుత్వ మాజీ అడ్వకేట్ జనరల్ దొమ్మలపాటి  శ్రీనివాస్ మీద ఏసీబీ నమోదు చేసిన కేసు మీద  తదుపరి చర్యలు తీసుకోవద్దని ఏసీబీని ఆదేశించడం కూడా ప్రజల్లో అనేక ప్రశ్నలు లేవనెత్తింది. 

అమరావతి ఇన్సైడర్ ట్రేడింగ్ లో నమోదైన కేసులో దొమ్మలపాటి శ్రీనివాస్ తో పాటు ఇంకా చాలా పేర్లు ఉన్నాయి. అందులోప్రధానమైనవి సుప్రీంకోర్టు న్యాయమూర్తి అయిన ఎన్.వి.రమణ కూతుళ్లు   నూతలపాటి శ్రీ తనుజ, నూతలపాటి శ్రీ భువన. వీరిద్దరి పేర్లను ఏసీబీ తన ఎఫ్ఐఆర్ లో నమోదు చేయడం జగన్ ప్రభుత్వం ఒక విధంగా న్యాయస్థానాలతో యుద్ధానికి సిద్ధం అయినట్టే అనిపిస్తుంది.  

వైయస్ జగన్ మీద అనేక కేసులు ఉన్నాయి. అవి వివిధ దశల్లో విచారణకు సిద్ధం ఉన్నాయి. ఇటువంటి సమయంలో జగన్ ప్రభుత్వం  ఒక సుప్రీంకోర్టు న్యాయమూర్తి పిల్లల పేర్లను ఎఫ్ఐఆర్ లో నమోదు చేయడం అంటే ఇందులో ఏదో దీర్ఘకాలిక వ్యూహం ఉందని భావించాలి. 

ఇప్పటికే  అనేక ప్రభుత్వ నిర్ణయాలను న్యాయస్థానాలు కొట్టివేయడం గాని  ఆపివేయడం గాని చేశాయి.  న్యాయస్థానాల మీద వాటి తీర్పు మీద ఒక అనుమానం కలిగించే లాగా జగన్ చేయగలిగారు. కొత్తగా ఏసీబీ కేసుతో సరాసరి సుప్రీంకోర్టు న్యాయమూర్తిని సవాల్ చేసారు. రేపు పొద్దున ఈ కేసు ముందుకు కదలకపోతే ఇది కొందరు కీలకమైన  వ్యక్తులు వారి  పిల్లలు కేసులో ఉన్నారు కాబట్టి ఈ కేసు ముందుకు వెళ్లడం లేదని జగన్ ప్రభుత్వం ఒక వాదన చేస్తుంది. అవినీతి ఉంటే చర్యలు తీసుకోండి అనే చంద్ర బాబు చేసే సవాలుకి ఇది జవాబుగా మిగులుతుంది. ప్రజలు కూడా నమ్మే వాదనే అవుతుంది. 

ఇంకో కోణం లో  జగన్ మీద ఉన్న కేసులు ఏదైనా అనుమానం కలిగించే తీర్పు వస్తే అప్పుడు కూడా వైఎస్సార్ కాంగ్రెస్ కి ఈ ఏసీబీ కేసు ఒక  కవచంలా ఉపయోగపడుతుంది.   తీర్పు అలా ఎందుకు వచ్చిందో చెప్పుకోవడానికి ఒక కారణం దొరుకుతుంది.  అవినీతిని సహించని వైయస్ జగన్ ప్రభుత్వం  ఒక సుప్రీంకోర్టు న్యాయమూర్తి పిల్లలని ఒక ఎఫ్ఐఆర్లో పెట్టడం వల్లనే ఇదంతా జరుగుతుంది అని ప్రభుత్వం నేరుగా చెప్పకపోయినా పార్టీగా వైఎస్సార్ కాంగ్రెస్ కు  ఉన్న సోషల్ మీడియా ప్రజల్లోకి తీసుకు వెళుతుంది

మొత్తనికి న్యాయస్థానాల తీర్పుల మీద ఏమి మాట్లాడకుండానే  వైయస్ జగన్ న్యాయమూర్తులని ఒక మెట్టుదించి తనకు సమాన స్థాయిలో నిలబెట్టాడు. ఇప్పుడు ఈ పోరాటం వ్యవస్థల మధ్య కాకుండా వ్యక్తుల మధ్య అనే భావన కలిగించడంలో సఫలీకృతులైయ్యారు. న్యాయమూర్తులేమి మానవాతీతం కాదని ప్రజల్లోకి తీసుకెళ్లగలిగారు. 

వైయస్ జగన్ న్యాయస్థానాల తో  తను చేయబోయే దీర్ఘకాలిక పోరాటానికి నిన్న నమోదైన ఏసీబీ కేసు అందులో చేర్చిన పేర్లు ఒక తొలిమెట్టు. రాబోయే కాలంలో ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో హైకోర్టు, సుప్రీంకోర్టు కూడా ఒక విశిష్టమైన పాత్ర పోషించే పరిస్థితి కనిపిస్తుంది. మొండివాడు రాజుకంటే బలవంతుడు, రాజే మొండివాడైతే……