మాకు వేరే గత్యంతరం లేదు.. మీ పేరు రాసి ఆత్మహత్య చేసుకుంటాం. భారీ వర్షాలు కురిసినా.. రోడ్లన్నీ జలమయం అయినా.. మమ్మల్ని సేఫ్ ప్లేస్ కు తీసుకెళ్లడానికి ఎవరూ రాలేదు. మూడు రోజుల నుంచి తిండి తిప్పలు లేకుండా బతుకుతున్నాం. ఇప్పుడు చూడటానికి మీరు వచ్చారా? మీ పేరు రాసి ఆత్మహత్య చేసుకోవడం తప్పితే మాకు ఇంకో దారి లేదు.. అంటూ ఉప్పల్ ఎమ్మెల్యే సుభాష్ రెడ్డిపై మహిళలు తిరగబడ్డారు. ఆ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
హైదరాబాద్ లో గత మూడు నాలుగు రోజుల నుంచి భారీ వర్షం కురుస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో రామంతాపూర్ పెద్ద చెరువు నిండి పోయి.. పక్కనే ఉన్న ప్రాంతాలన్నీ మునిగిపోయాయి. దీంతో ముంపు ప్రాంతాలను ఉప్పల్ ఎమ్మెల్యే సుభాష్ రెడ్డి పర్యటించారు. ఈ సందర్భంగా రవీంద్ర నగర్ కాలనీలో పర్యటిస్తున్న ఎమ్మెల్యేపై మహిళలు తిరగబడ్డారు. ఇప్పుడు వచ్చారా? మూడు రోజుల నుంచి మాకు తిండీ తిప్పలు లేవు. మమ్మల్ని సురక్షిత ప్రాంతాలకు తరలించలేదు. ఇదేం ప్రభుత్వం.. అంటూ ఎమ్మెల్యేపై మహిళలు ఆగ్రహం వ్యక్తం చేయగా… ఇక్కడ మిమ్మల్ని ఇల్లు ఎవరు కట్టుకోమన్నారు.. ఇదంతా ముంపు ప్రాంతం.. అంటూ ఎమ్మెల్యే ఆ మహిళలపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
చివరకు ఆ మహిళలు చెబుతున్నా వినకుండా ఆ ఎమ్మెల్యే అక్కడి నుంచి వెళ్లిపొవడంతో స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.