మహిళా ఖైదీల విషయంలో జగన్ చారిత్రక నిర్ణయం

దేశ చరిత్రలోనే మహిళా ఖైదీల విషయంలో ఏపీ సీఎం జగన్ చారిత్రక నిర్ణయం తీసుకున్నారు. జీవిత ఖైదు పడ్డ మహిళా ఖైదీల విషయంలో ఔదార్యం చాటారు.జీవిత ఖైదు శిక్ష పడి ఐదేళ్ల కంటే ఎక్కువ కాలం జైళ్లలో మగ్గుతున్న ఖైదీలను విడుదల చేయాలని ఆదేశాలు జారీ చేశారు. ఈ ఉత్తర్వులతో ఏపీలోని పలు జైళ్లో మగ్గుతున్న 147 మంది మహిళా జీవిత ఖైదీల్లో 55 మంది విడుదల కానున్నారు.

అనివార్య పరిస్థితుల్లో కొందరు, క్షణికావేశంలో మరి కొందరు మహిళలు నేరాలకు పాల్పడ్డారని… జైలు జీవితం వీరిలో మార్పు తీసుకొచ్చిందని ఏపీ హోంశాఖ మంత్రి మేకతోటి సుచరిత అన్నారు. అయితే ఖైదీల విడుదల విషయంలో… జరిగిన నేరాల్లో సదరు ఖైదీల పాత్ర, ఏ పరిస్థితుల్లో వాళ్లు ఆ నేరానికి పాల్పడాల్సి వచ్చిందనే అంశాన్ని ప్రామాణికంగా తీసుకొని విడుదల చేస్తున్నట్లు వెల్లడించారు. జైలు జీవితంలో వీరిలో మార్పు తీసుకొచ్చిందని చేసిన తప్పుకు పశ్చాత్తాప పడ్డారని…పశ్తాత్తాపాన్ని మించిన ప్రాయోచిత్తం లేదన్న విషయాన్ని గుర్తించి వారికి మరొక అవకాశం ఇవ్వాలన్న సదుద్దేశ్యంతో సీఎం జగన్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఏపీ హోం మంత్రి మేకతోటి సుచరిత వెల్లడించారు.

 

హోం మంత్రిగా పలు జైళ్లను సందర్శించినప్పుడు మహిళా ఖైదీల బాధలు విన్నానని … అవన్నీ సీఎం జగన్ కు వివరించడంతో ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారని చెప్పారు. వారం రోజుల్లోగా వీరందరినీ విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు. అలాగే పురుష ఖైదీల విషయంతో మాత్రం యధావిధిగా జనవరి 26న గణతంత్ర దినోత్సవం సందర్భంగా కొంత మందిని విడుదల చేస్తామని స్పష్టం చేశారు.