ఎన్డీయేలో వైసీపీ చేరుతుందా.? ఆ ఛాన్సుందా.?

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, కేంద్రంలో అధికారంలో వున్న ఎన్డీయే కూటమిలో చేరుతుందా.? ఏమో, రాజకీయాల్లో శాశ్వత శతృవులు శాశ్వత మిత్రులూ ఎవరు వుండరు గనుక.. పరిస్థితులు అనుకూలిస్తే వైఎస్ జగన్, ఎన్డీయేలో చేరేందుకు సుముఖత వ్యక్తం చేయొచ్చు. కానీ, భారతీయ జనతా పార్టీ అందుకు సుముఖత వ్యక్తం చేస్తుందా.? అన్నదే అసలు ప్రశ్న.

బీజేపీ – వైసీపీ మధ్య అసలు రాజకీయ స్నేహం వుందా.? లేదా.? అన్నదానిపై భిన్న వాదనలున్నాయి. తెరవెనుక బీజేపీ – వైసీపీ మధ్య సఖ్యత వుంది. ఇది ఓపెన్ సీక్రెట్. ఎందుకంటే, కేంద్రంలో అధికారంలో వున్న మోడీ సర్కారుకి.. ప్రధానంగా భారతీయ జనతా పార్టీకి ఎప్పుడు అవసరం వచ్చినా, వైసీపీ నుంచి పూర్తి మద్దతు లభిస్తోంది. రాష్ట్రంలో మాత్రం బీజేపీ – వైసీపీ మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేంత రాజకీయ వైరం ‘కనిపిస్తోంది’.

పైకి కనిపించేది వేరు.. తెరవెనుకాల జరిగేది వేరు. అసలు విషయమేంటంటే, కేంద్ర మంత్రి రాందాస్ అథవాలే, వైసీపీని ఎన్డీయే కూటమిలో చేరాలని కోరుతున్నారు. వైఎస్ జగన్ తనకు మంచి మిత్రుడనీ సెలవిచ్చారాయన. నిజానికి, పలువురు కేంద్ర మంత్రులు ఎన్డీయేలోకి వైసీపీని ఆహ్వానించేందుకు తెరవెనుక కసరత్తులు చేసినట్లు గతంలో ప్రచారం జరిగింది.. ప్రచారం జరుగుతూనే వుంది.

అయితే, ఏపీ బీజేపీ నేతలు మాత్రం ఆ ప్రచారాన్ని తిప్పి కొడుతున్నారు.. వైసీపీ మీద ఈ విషయమై దూషణలకు కూడా దిగుతున్నారు.. వైసీపీ దుష్పచారం చేస్తోందని ఆరోపిస్తూ. కాగా, బీజేపీ – వైసీపీ మధ్య అసలు ఏదైనా స్నేహ బంధం వుందా.? వుంటే, అదెలాంటి సంబంధం.? అన్నదానిపై బీజేపీ మిత్రపక్షమైన జనసేనకు స్పష్టత లేకుండా పోయింది.

కాగా, రాందాస్ అథవాలే వ్యాఖ్యలతో బీజేపీ – జనసేన మధ్య మళ్ళీ కొత్త అనుమానాలు షురూ అయ్యాయి. జనసేన ఎటూ టీడీపీ పంచన చేరుతుందనే అనుమానం బీజేపీకి వుంది. అదే సమయంలో వైసీపీతో కలుపుకుపోవడమే మంచిదన్న అభిప్రాయంలోనూ బీజేపీ వుంది. సో, ఈక్వేషన్స్ ఎలా రాష్ట్రంలో ముందు ముందు మారతాయో ఇప్పుడే చెప్పలేం.