Viveka’s Daugter Sunitha : మాజీ మంత్రి, మాజీ ఎంపీ, మాజీ ఎమ్మెల్సీ వైఎస్ వివేకానందరెడ్డి కుమార్తె సునీతా రెడ్డి తెలుగుదేశం పార్టీ నుంచి పోటీ చేయబోతున్నారా.? ఈ విషయమై అధికార వైసీపీకి చెందిన నేతలు చేస్తున్న వ్యాఖ్యలు అందర్నీ విస్మయానికి గురిచేస్తన్నాయి. మరీ ముఖ్యంగా వైసీపీ ముఖ్య నేత, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అయితే, ఎలాగైనా సునీతా రెడ్డిని టీడీపీ నుంచి పోటీ చేయించాలనే కసితో వున్నట్లు కనిపిస్తున్నారు.
ఇదెక్కడి చోద్యం.? రేప్పొద్దున్న వైఎస్ షర్మిల మీద కూడా సజ్జల రామకృష్ణారెడ్డి ఇవే తరహా ఆరోపణలు చేసినా ఆశ్చర్యపోవాల్సిన పనిలేదు. వైఎస్ వివేకానందరెడ్డి హత్యకు సంబంధించి సీబీఐ విచారణను గతంలో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కోరిన విషయం విదితమే. అధికారంలోకి వచ్చాక మాత్రం, ‘సీబీఐ విచారణ అవసరం లేదు’ అనేశారాయన.
అక్కడితోనే అసలు కథ మొదలైంది. సరే, ముఖ్యమంత్రిగా తానే వున్నాను కాబట్టి.. విచారణ సజావుగా సాగుతుందని వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అనుకోవచ్చు. కానీ, ఇలాంటి విషయాల్లో ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్ అతి విశ్వాసాన్ని చూపుతారని అనుకోలేం. సరే, జరిగిందేదో జరిగిపోయింది. సీబీఐ రంగంలోకి దిగింది. విచారణ జరుగుతోంది.
ఈ తరుణంలో సవాలక్ష లీకులు తెరపైకి రావడం సహజమే. ముఖ్యమంత్రిగానే కాదు.. సోదరుడిగా కూడా సునీతా రెడ్డికి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అండగా వుండి వుండాల్సింది. వున్నారా.? లేదా.? అన్నది మళ్ళీ వేరే చర్చ. సునీతారెడ్డిపై విమర్శలు చేయించడమంటే.. తమ గొయ్యి తామే తవ్వుకున్నట్లని వైసీపీ తెలుసుకోకపోతే ఎలా.?