Ys Jagan : మంత్రి బొత్స సత్యనారాయణ ఒకప్పటి కాంగ్రెస్ నేత.. మంత్రి అవంతి శ్రీనివాస్ ఒకప్పటి టీడీపీ నేత.. మంత్రి కొడాలి నాని ఒకప్పటి టీడీపీ నేత. చెప్పుకుంటూ పోతే లిస్టు చాలా పెద్దదే. వైసీపీలో చాలామంది మంత్రులు ఇతర పార్టీల నుంచి వచ్చినవారే. ఎమ్మెల్యేలలో చాలామందిదీ ఇదే పరిస్థితి. ఎంపీల సంగతి సరే సరి.
గతంలో ఆయా పార్టీలో వుండి, అప్పట్లో వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని విమర్శించిన నేతలు, ఇప్పుడు వైసీపీలో వుండి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని ప్రశంసిస్తున్నారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి హెలికాప్టర్ ప్రమాదంలో మరణించడం వెనుక అనుమానాలున్నాయనీ, ఈ విషయమై వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని కూడా అనుమానించాల్సి వస్తుందని గతంలో బొత్స వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే.
రాజకీయాలంటేనే అంత. మరి, వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఇప్పుడు బహు గొప్ప పథకాలంటూ నవరత్నాల గురించి ప్రచారం చేస్తున్నారు సరే.. రేప్పొద్దున్న అధికారం కోల్పోతే ఏంటి పరిస్థితి.? చంద్రబాబు హయాంలో వచ్చిన పథకాల్ని చెత్త పథకాలుగా వైఎస్ జగన్ అభివర్ణించారు. ఆ లెక్కన చంద్రబాబు తిరిగి అధికారంలోకి వచ్చినా, జనసేన అధికారంలోకి వచ్చినా నవరత్నాలు చెత్త పథకాలే అవుతాయి కదా.?
ఎవరి సంగతో పక్కన పెడితే, ప్రస్తుతం మంత్రులుగా వున్న బొత్స సత్యనారాయణ లాంటోళ్ళు భవిష్యత్తులో ఈ పథకాల గురించి ఎలా మాట్లాడతారు.? అన్న ప్రశ్న వైసీపీ వర్గాలలోనే చర్చనీయాంశమవుతోంది. వైసీపీ హయాంలో కొందరు మంత్రులకు ఐడెంటిటీ లేకుండా పోయిందన్న విమర్శలకు ఆస్కారమెందుకు ఏర్పడుతోందో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆత్మవిమర్శ చేసుకోవాల్సి వుంది.
పొగడ్తలకు పొంగిపోతే.. రేప్పొద్దున్న ఇబ్బంది పడాల్సి వస్తుందని చంద్రబాబుని చూసి అయినా జగన్ నేర్చుకోకపోతే ఎలా.?