Sharmila : బీజేపీతో వైఎస్ షర్మిల చేతులు కలపబోతున్నారా.?

Sharmila :  ఔనా.? వైఎస్ షర్మిల సొంత పార్టీని పక్కన పెట్టి, భారతీయ జనతా పార్టీలో చేరిపోతారా.? బీజేపీలో చేరి, ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో షర్మిల చక్రం తిప్పాలనుకుంటున్నారా.? అన్న వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మీద పంతం నెగ్గించుకునే ప్రయత్నంలో వున్నారా.? ఇలా చాలా ప్రశ్నలు తెరపైకొస్తున్నాయి.

‘ఆంధ్రప్రదేశ్‌లో మా పార్టీని విస్తరిస్తే తప్పేంటి.?’ అని షర్మిల ఎదురు ప్రశ్నించడమే ఇన్ని ఊహాగానాలకు కారణం. తెలంగాణ రాజకీయాల్లో చక్రం తిప్పే దిశగా షర్మిల కొన్నాళ్ళ క్రితం ‘వైఎస్సార్ తెలంగాణ పార్టీ’ని స్థాపించిన విషయం విదితమే.

అన్న వైఎస్ జగన్ మోహన్ రెడ్డితో విభేదించి.. అనే మాట ఉత్తమాటే. ఎందుకంటే, వైఎస్ జగన్ ప్రోద్భలం లేకుండా షర్మిల, రాజకీయాల్లో రాణించే పరిస్థితి లేదు. ఇది అందరికీ తెలిసిన విషయమే. కానీ, కుటుంబమన్నాక అభిప్రాయ బేధాలు మామూలే. పైగా, రాజకీయాల్లో బంధుత్వాలకు పెద్దగా విలువ వుండదు. సెంటిమెంట్లకు ఛాన్సే వుండదు. రాజకీయ అవసరాల నిమిత్తం మాత్రమే సెంటిమెంట్లు పని చేస్తాయి.

సో, షర్మిల.. జగన్ మోహన్ రెడ్డిని కాదని ఎలాంటి రాజకీయ నిర్ణయం తీసుకోరన్నది ఓ వాదన అయితే, తన రాజకీయ అవసరాల కోసం షర్మిల ఎలాంటి సంచలన నిర్ణయమైనా తీసుకునే అవకాశం లేకపోలేదన్నది ఇంకో వాదన.

వైఎస్ షర్మిల, ఏపీలో పార్టీని విస్తరించాలనే నిర్ణయం తీసుకున్నాక, ప్రధాని నరేంద్ర మోడీ సహా, కేంద్ర హోం మంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా తదితరుల అపాయింట్మెంట్లను కోరారంటూ ఓ గాసిప్ రాజకీయ వర్గాల్లో హల్‌చల్ చేసింది. అంతలోనే, ఏపీ ముఖ్యమంత్రి హోదాలో వైఎస్ జగన్ ఢిల్లీకి వెళ్ళారు. ఒకదానితో ఒకటి సంబంధం లేని అంశాలా.? రెండిటికీ మధ్య సంబంధం వుందా.? ఏమో, రాజకీయాల్లో ఏదైనా జరగొచ్చు.