షర్మిల పార్టీకి వైఎస్సార్సీపీ మద్దతు వుందా.? లేదా.?

Will Sharmila Got The Support From YSRCP

Will Sharmila Got The Support From YSRCP

వైఎస్ షర్మిల, తన తండ్రి దివంగత వైఎస్ రాజశేఖర్ రెడ్డి జయంతి సందర్భంగా, తెలంగాణలో తాను స్థాపించబోయే రాజకీయ పార్టీపై ప్రకటన చేయబోతున్నారు. పార్టీ జెండా, పార్టీ పేరు.. రెండూ ఈ రోజే ప్రకటితం కానున్నాయి. అయితే, పార్టీ పేరు.. జెండా వివరాలు కొద్ది రోజుల క్రితమే లీక్ అయిపోయాయనుకోండి.. అది వేరే సంగతి. వైఎస్సార్ తెలంగాణ పార్టీ పేరుతో షర్మిల కొత్త పార్టీ ప్రారంభిస్తున్నారు. ఇదిలా వుంటే, ఈ రోజు ఉదయం షర్మిల, వైఎస్సార్ సమాధి వద్ద ప్రత్యేక ప్రార్థనలు నివాళులర్పించారు.

వైఎస్సార్ జయంతి పురస్కరించుకుని వైఎస్సార్ అభిమానులు పెద్ద సంఖ్యలో వైఎస్సార్ సమాధి వద్దకు చేరుకుంటున్నారు. వైఎస్ షర్మిల వెంట విజయమ్మ కూడా వున్నారు. వైఎస్సార్ సమాధి మీద షర్మిల, తన పార్టీ జెండాని వుంచి తండ్రి ఆశీస్సులు పొందారు. అనంతరం ఆమె హైద్రాబాద్ పయనమయ్యారు. ఇక్కడి వరకూ బాగానే వుంది. ఇంతకీ, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మద్దతు షర్మిలకు ఎంత మేర వుంటుంది.? అన్నదే అసలు ప్రశ్న.

నిజానికి, తెలంగాణ రాష్ట్రానికి చెందిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతల్లో చాలామంది షర్మిల గ్రూపులోకి జంప్ చేసేశారు. సో, పూర్తిగా వైఎస్సార్సీపీ మద్దతు షర్మిలకు వుందనే భావించాలి. అయితే, షర్మిల తన పార్టీకి సంబంధించి తన సోదరుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి సంబంధించిన మీడియా సంస్థల్లో ప్రకటనలు ఇవ్వలేదు.

చిత్రమేంటంటే, వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి మీడియాలో ప్రధాన ప్రత్యర్థుల్లో ఒకరైన వేమూరి రాధాకృష్ణకి చెందిన ఆంధ్రజ్యోతిలో మాత్రం షర్మిల పార్టీ ప్రకటనలు కనిపిస్తున్నాయి. అయితే, ఇదంతా షర్మిల, వైఎస్ జగన్ వ్యూహాత్మకంగానే చేస్తున్నారన్న వాదన లేకపోలేదు. కాగా, షర్మిల పార్టీకి వైఎస్సార్సీపీ మద్దతుదారుల నుంచి పూర్తిస్థాయిలో సపోర్ట్ లభిస్తోంది సోషల్ మీడియా వేదికగా. అంటే, వైసీపీ నుంచి షర్మిలకు మద్దతు వున్నట్టే కదా.?