పోలవరం.. ఈ దశాబ్దంలోపు పూర్తయ్యే అవకాశముందా.?

పోలవరం జాతీయ ప్రాజెక్టు.. 20‌14 నుంచి ఇప్పటిదాకా.. అంటే, 2021 వరకు కేంద్రం, పోలవరం ప్రాజెక్టుకి ఇచ్చిన నిధులెంతో తెలుసా.? 11,182 కోట్లు. పోలవరం ప్రాజెక్టుకి సంబంధించి సవరించిన అంచనాల ప్రకారం ప్రాజెక్టు పూర్తి చేయడానికి 55,657 కోట్లు అవసరం. ఈ విషయమై కేంద్రానికి రాష్ట్రం గతంలోనే నివేదిక ఇచ్చింది. కేంద్రం ఆమోదించినట్లే ఆమోదించి, సవాలక్ష మెలికలు పెట్టింది. చంద్రబాబు హయాంలోనే 55 వేల కోట్ల రూపాయల మేర సవరించిన అంచనాలకు కేంద్రం ఆమోదించిన విషయం విదితమే. జగన్ హయాంలోకొచ్చేసరికి సీన్ మారింది. కేంద్రం ఈ విషయమై నానా గందరగోళం సృష్టించింది. ఓ వైపు నిధుల విషయమై అడ్డగోలు వాదనలు చేస్తూనే, ఇంకో వైపు పోలవరం ప్రాజెక్టు బాధ్యత పూర్తిగా తమదేనని కేంద్రం చెబుతోంది. నిధులు ఇవ్వకుండా పోలవరం ప్రాజెక్టు ఎలా పూర్తవుతుంది.? ఓ వైపు, పోలవరం ప్రాజెక్టు పనులు శరవేగంగా జరుగుతున్నాయి. కానీ, ముంపు పునరావాసానికి సంబంధించి లెక్కలు తేలడంలేదు. దాంతో ముంపు బాధితులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ముంపు బాధితుల ఒత్తిడితో ఏం చేయాలో పాలు పోని పరిస్థితి రాష్ట్ర ప్రభుత్వానిది.

చిత్రమేంటంటే, ముంపు బాధితులకు పునరావాస ఏర్పాట్లు సరిగ్గా లేవని ఏపీ బీజేపీ ఆరోపిస్తోంది. కేంద్రం నుంచి రావాల్సిన నిధులు సకాలంలో వచ్చేస్తే.. రాష్ట్రంలో ఎవరు అధికారంలో వున్నా పనులు శరవేగంగా పూర్తవుతాయి. ఈ విషయం కేంద్రంలో అధికారంలో వున్న బీజేపీకి తెలియదని ఎలా అనుకోగలం.? రాష్ట్ర ప్రభుత్వమే బాధ్యత తీసుకుంటే, ప్రాజెక్టు నిర్మాణ పనులు మరింత వేగంగా జరిగే అవకాశముందని ప్రధాని మోడీ గతంలో అభిప్రాయపడటంతోనే పోలవరం ప్రాజెక్టు నిర్మాణ బాధ్యత పూర్తిగా రాష్ట్రం చేతికి వచ్చింది. పర్యవేక్షణ మాత్రం కేంద్రానిదే. మరి, పర్యవేక్షిస్తున్న కేంద్రం, ముంపు బాధితుల కోసం ఎంత పరిహారం ఇవ్వాలో తెలియనంత అయోమయంలో వుంటుందా.? ఇదే తాత్సారం కొనసాగితే, పోలవరం ప్రాజెక్టు ఇంకో దశాబ్దం తర్వాత కూడా పూర్తయ్యే అవకాశం కన్పించడంలేదు. రాష్ట్రం మాత్రం ఇప్పుడున్న ఆర్థిక సంక్షోభం నేపథ్యంలో ఎంతవరకు సొంత నిధుల్ని ఈ ప్రాజెక్టు కోసం వెచ్చించగలుగుతుంది.?