Bheemla Nayak : జనసేన అధినేత, సినీ నటుడు పవన్ కళ్యాణ్ ఈ మధ్యనే ఆంధ్రప్రదేశ్‌కి వెళ్ళి, అక్కడి ప్రభుత్వానికి సవాల్ విసిరారు.. తన సినిమాల విషయమై. ‘నా ఆర్థిక మూలాల్ని దెబ్బకొట్టాలనుకుంటే అది కుదరని పని. అవసరమనుకుంటే నా సినిమాని ఉచితంగా చూపిస్తా..’ అంటూ పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యల తాలూకు దుమారం ఇంకా కొనసాగుతూనే వుంది.
ఇలా సవాల్ విసిరి, అలా సైలెంటయిపోవడం పవన్ కళ్యాణ్‌కి అలవాటైపోయిన వ్యవహారమంటూ అధికార వైసీపీ సెటైర్లు వేస్తోంది. మరోపక్క, పవన్ కళ్యాణ్ గనుక మాట మీద నిలబడే వ్యక్తి అయితే తన తాజా చిత్రం ‘భీమ్లా నాయక్’ని ఉచితంగా థియేటర్లలో ప్రదర్శించాలంటూ సోషల్ మీడియా వేదికగా డిమాండ్లు పుట్టుకొస్తున్నాయి.
ఏదో పవన్ ఫ్లోలో అలా అనేశారుగానీ, ఉచితంగా.. అంటే అది సాధ్యమయ్యే పనేనా.? అదీ సినిమా థియేటర్లలో విడుదల చేయడం. ఛాన్సే లేదు. ఎందుకంటే, పవన్ కళ్యాణ్ ఆ సినిమాకి నిర్మాత కాదు. పవన్ ప్రకటనతో ఆయనతో సినిమాలు నిర్మిస్తున్న చాలా నిర్మాణ సంస్థలు అయోమయంలో పడిపోయాయి.
అయితే, పవన్ చాలా ధైర్యంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి సవాల్ విసరగలిగారనీ, ఆ ధైర్యం ఇతర హీరోలలో లేకుండా పోయిందంటూ పవన్ కళ్యాణ్‌ని సమర్థిస్తున్నవారూ లేకపోలేదు. తెలంగాణలోనూ, ఇతర పొరుగు రాష్ట్రాల్లోనూ సినిమా టిక్కెట్ల విషయమై ఎలాంటి తలనొప్పులూ లేవు. కేవలం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే సినీ పరిశ్రమ టిక్కెట్ల విషయమై సమస్యల్ని ఎదుర్కొంటోంది.
ఇలాంటి సందర్భంలో పవన్ కళ్యాణ్ ప్రశ్నించడం సబబుగానే వున్నా, దాన్ని కేవలం రాజకీయ కోణంలో, రాజకీయ వైరంతో పవన్ చూస్తుండడమే అసలు సమస్య అన్నది మెజార్టీ అభిప్రాయం.
ఏమో, ఈ వివాదం ఎక్కడిదాకా వెళుతుందోగానీ, సినీ పరిశ్రమ మాత్రం ఏపీలో సినిమా టిక్కెట్ ధరలపై ఒకింత దిగులు చెందుతూనే వుంది. ఆ సమస్యకు పరిష్కారం ఎప్పుడు దొరుకుతుందో ఏమో.