జనంలోకి జనసేనాని.. జనసైనికుల్లో జోష్ వస్తుందా.?

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చాలా కాలం తర్వాత జనంలోకి వెళ్ళబోతున్నారు. తూర్పుగోదావరి జిల్లాలో రోడ్లను బాగు చేసేందుకు శ్రమదానం చేయనున్నారట జనసేన అధినేత. ఈ మేరకు పార్టీ వర్గాలు స్పష్టతనిచ్చాయి. అక్టోబర్ 3వ తేదీని ఇందుకు ముహూర్తంగా నిర్ణయించారు. వైఎస్ జగన్ ప్రభుత్వం పైకి ఏం చెబుతున్నా, రాష్ట్రంలో చాలా రోడ్లు అత్యంత దయనీయ స్థితిలో వున్నాయన్నది నిర్వివాదాంశం. కారణాలు ఏవైనప్పటికీ, ఆ రోడ్లను వీలైనంత త్వరగా బాగు చేయాల్సిన బాధ్యత ప్రభుత్వం మీదనే వుంది. వేల కోట్లు సంక్షేమం మీద ఖర్చు చేస్తున్న జగన్ సర్కారు, పాడైపోయిన రోడ్ల కోసం వందల కోట్లు ఖర్చు చేయడానికీ వెనుకాడుతుండడం పలు అనుమానాలకు తావిస్తోంది. అయితే, ఎప్పటికప్పుడు కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో రోడ్లు బాగు చేయడానికి వీలు చిక్కడంలేదనీ, రోడ్లు మరింతగా పాడైపోతున్నాయనీ అధికార పార్టీ నేతలు చెబుతున్నారు.

ఇలాంటి కారణాలతో ప్రజల అవస్థల్ని పైకి కనిపించనీయకుండా చేయడం సబబు కాదు అధికార పార్టీకి. రోడ్లు అనేవి అభివృద్ధికి రాచ మార్గాలు. రోడ్లు సరిగ్గా లేకపోతే, అభివృద్ధి కుంటుపడుతుందన్నది నిర్వివాదాంశం. రోడ్ల కారణంగా ప్రజారోగ్యం దెబ్బ తింటోంది. ఎన్నో ప్రాణాలూ పోతున్నాయి. నిత్యం వాహనాల మరమ్మత్తులతో ఆర్థికంగా వాహనదారులు నష్టపోతున్నారు. ఇవన్నీ ప్రభుత్వానికి సైతం నష్టం కలిగించేవే. అందుకే, ఈ సమస్య మీద జనసేన పార్టీ ఒకింత గట్టిగా నిలబడింది. రాజకీయాల సంగతి పక్కన పెడితే, జనసైనికులు తమ పరిధిలో పాడైపోయిన రోడ్లకు రిపెయిర్లు చేయడంలో కొంత సఫలమవుతున్నారు. కానీ, వారికి పార్టీ పరంగానే సరైన గుర్తింపు దక్కని పరిస్థితి. ఇలాంటి పరిస్థితుల్లో జనసేన అధినేత రంగంలోకి దిగితే.. విషయం పొలిటికల్‌గా జనసేన పార్టీకి మరింత మైలేజ్ తెస్తుందన్నది నిర్వివాదాంశం. అధికార పార్టీ ఈ వ్యవహారాన్ని ఎలా డీల్ చేస్తుంది.? కోవిడ్ నిబంధనల సాకు చూపి, జనసేనాని పర్యటనకు అడ్డు తగులుతుందా.? వేచి చూడాల్సిందే.