2019 ఎన్నికల్లో వాపు చూసుకొని అదే తమ బలమని గుడ్డిగా నమ్మి పోటీ చేసి ఘోరమైన ఓటమి చవిచూసిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్, ఆ తర్వాత మెల్లగా ఆంధ్రకు దూరంగా వెళ్ళిపోయి, హైదరాబాద్ లోనే మకాం పెట్టేసి, తనకు బాగా అలవాటైన సినిమాలు చేసుకుంటున్నాడు, ఇదే సమయంలో రాజకీయంగా యాక్టీవ్ గా ఉండటం కోసం బీజేపీతో పొత్తు పెట్టుకొని కాషాయ నీడలో మెల్లగా రాజకీయ జీవితం గడుపుతున్నాడు.
ఇలాంటి సమయంలో గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు రావటంతో బీజేపీ ఎలాగోలా ఇక్కడ తన సత్తా చూపించుకోవాలని తాపత్రయ పడుతుంది. కానీ గ్రేటర్ లో బీజేపీ కి తగినంత బలం లేకపోవటంతో ఎలాగూ పవన్ కళ్యాణ్ తమతో పొత్తులో వున్నాడు కాబట్టి అతన్ని ఇందులోకి లాగితే తమకు లాభం రావచ్చనే అంచనాతో బీజేపీ పావులు కదిపి పవన్ కళ్యాణ్ ను గ్రేటర్ ఎన్నికల గోదాంలోకి లాగాయి. కేవలం ఆంధ్రాలోనే కాదు తెలంగాణాలో కూడా జనసేన కే భారీ స్థాయిలో ఫాలోయింగ్ ఉందని, ఇక్కడ కూడా ఓటు బ్యాంకు బాగానే ఉందని చెప్పటంతో బీజేపీ మాటలకూ కన్విన్స్ అయినా పవన్ కళ్యాణ్ ఉన్నపళంగా ఒక 50 డివిజన్స్ లో జనసేన కమిటీలను ఏర్పాటు చేశాడు.
అంతే కాకుండా నిన్నటికి నిన్న మాదాపూర్ నుండి మియాపూర్ వరకు మెట్రో లో ప్రయాణించి గ్రేటర్ ఎన్నికలకు నేను సిద్ధం అనే సంకేతాలు పంపించాడు. గతంలో 2018 వ సంవత్సరం లో తెలంగాణ ముందస్తు ఎన్నికల లో కూడా జనసేన పార్టీ పోటీ చేస్తుందా లేదా అన్న విషయాన్ని… చివరి వరకు చెప్పకుండా పవన్ నోరు మెదపకుండా ఉండటంతో అప్పట్లో అనేక విమర్శలు వచ్చాయి. ఈ క్రమంలో చివరి నిమిషంలో జనసేన పార్టీ పోటీ చేయడం లేదని తెలపడంతో తెలంగాణ జనసేన క్యాడర్ నిరుత్సాహానికి గురి అయింది. ఇదిలా ఉండగా ఇప్పటికే రాజకీయంగా బాగా డ్యామేజ్ అయిన జనసేన పార్టీ ఏమాత్రం పట్టు లేని తెలంగాణ గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో కూడా ఓడిపోతే.. ఫెయిల్యూర్ పార్టీగా జనసేన పార్టీ ప్రజల దృష్టిలో మిగిలిపోతుందని పరిశీలకుల మాట.