New Districts : కొత్త జిల్లాలైనా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి ఊపిరి పోస్తాయా.?

New Districts : 13 జిల్లాలు కాస్తా 26 జిల్లాలుగా మారడం వల్ల వచ్చే అదనపు ప్రయోజనమేంటి.? ఈ ప్రశ్న చుట్టూ భిన్న వాదనలున్నాయి. కొత్తగా ఏర్పాటయ్యే జిల్లాలకు కలెక్టరేట్ సహా పలు ప్రభుత్వ కార్యాయాలకు కొత్తగా వస్తాయి. మరి, ఆ కొత్త కార్యాలయాలకుగాను కొత్త ఉద్యోగాలు ఏమైనా వస్తాయా.? అంటే, ప్చ్..చెప్పలేం.!

అయితే, కొత్తగా ఏర్పాటయ్యే జిల్లా కేంద్రాల కారణంగా, ఆయా పట్టణాలు, చిన్నపాటి నగరాలు మాత్రం మరింత అభివృద్ధి చెందుతాయి. ప్రధానంగా రియల్ ఎస్టేట్ వ్యాపారం పుంజుకుంటుంది.. భూముల ధరలూ పెరుగుతాయి. కానీ, వీటివల్ల ప్రయోజనం తాత్కాలికమేనా.? అన్నది కాస్త ఆలోచించాల్సిన విషయమే.

కొత్త జిల్లాల కేంద్రాలు అభివృద్ధి చెందుతాయి సరే. పాత జిల్లాల మాటేమిటి.? అక్కడ అభివృద్ధి గణనీయంగా తగ్గిపోతుందనే వాదనా లేకపోలేదు. పెద్ద జిల్లాకి వుండే వెసులుబాట్లు, చిన్న జిల్లాకి వుండే వెసులుబాట్లు.. దేనికవే. కొన్ని ఇబ్బందులు, కొన్ని ఆహ్వానించదగ్గ విషయాలూ.. తప్పవ్.

ఇప్పటికే కొత్త జిల్లాల ఏర్పాటు కారణంగా, ‘మీది.. మాది..’ అన్న భావన ప్రజల్లో పెరిగిపోయింది. నర్సాపురం – భీమవరం మధ్య రచ్చ జరుగుతున్న వైనాన్ని చూస్తున్నాం. రాజంపేట వర్సెస్ రాయచోటి.. మరీ దారుణంగా వుంది పరిస్థితి. ఇలా చాలా చోట్ల గందరగోళ పరిస్థితులు కనిపిస్తున్నాయి.

కాలక్రమంలో అన్నీ సర్దుకుపోతాయ్.. అనడానికీ వీల్లేని పరిస్థితి. ఎందుకంటే, భావోద్వేగాలు ఓసారి రెచ్చగొట్టబడితే, అవి అంత తేలిగ్గా చల్లారవ్. అభివృద్ధి సంగతి దేవుడెరుగు.. కొత్త జిల్లాలతో సరికొత్త వివాదాలు పుట్టుకొచ్చాయన్నది నిస్సందేహం.!