Mohanbabu : సీనియర్ నటుడు, నిర్మాత మోహన్‌బాబు తెలుగు సినీ పరిశ్రమ ఎదుర్కొంటున్న సమస్యలపై ఆవేదన వ్యక్తం చేస్తూ బహిరంగ లేఖ రాశారు. ఇందులో సొంత భజన తప్ప, పరిశ్రమ సమస్యలపై చిత్తశుద్ధి లేదన్న విమర్శ సర్వత్రా వినిపిస్తోందనుకోండి.. అది వేరే సంగతి. అయినాగానీ, సీనియర్ నటుడు అలాగే నిర్మాత కూడా అయిన మోహన్‌బాబు స్పందించారు గనుక, ఆయనకు మద్దతిచ్చేందుకు కొందరైనా సినీ ప్రముఖులు ముందుకొచ్చి వుండాలి.
నిర్మాత సి.కళ్యాణ్ అలా ముందుకొచ్చారు. కానీ, రావాల్సిన సినీ ప్రముఖులు చాలామంది మిన్నకుండిపోయారు. కారణమేంటని ఆరా తీస్తే, స్పందించాల్సిన సమయంలో మోహన్‌బాబు మౌనం దాల్చడంతో, ఇప్పుడాయన రాసిన లేఖలో చిత్తశుద్ధి లేదనే భావన సినీ పరిశ్రమలో ఎక్కువమంది నుంచి వ్యక్తమవుతోందట.
కాగా, తెలంగాణ ప్రభుత్వంతో సినీ పరిశ్రమకు పెద్దగా సమస్యలు లేవు. చిన్న నిర్మాతలు, సినిమా టిక్కెట్ల ధరల పెంపు పట్ల కొంత ఆందోళనతో వున్నారు. వారి కోసం వెసులుబాటు ఇచ్చే దిశగా తెలంగాణ ప్రభుత్వం సానుకూలంగానే వుంది గనుక.. అది పెద్ద సమస్యేమీ కాదు.
అసలు సమస్య ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతోనే వుంది సినీ పరిశ్రమకి. సో, మోహన్‌బాబు నేరుగా ఆంధ్రప్రదేశ్ వెళ్ళి, బంధుత్వం కూడా వుంది గనుక ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డితో, సినీ పరిశ్రమ సమస్యలపై చర్చించి వుంటే బావుండేదేమో.
‘మా’ అధ్యక్షుడి హోదాలో మంచు విష్ణు అయినా, ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌ని పరిశ్రమ సమస్యల గురించి కలిసి వుంటే ఈక్వేషన్ ఇప్పుడు ఇంకోలా వుండేది. ఏదిఏమైనా, బేషజాలకు పోవాల్సిన సందర్భం కాదిది. పరిశ్రమలో అందరూ ఒక్కతాటిపైకొచ్చి, సమస్యల పరిష్కారం కోసం ప్రయత్నించాలి.