Andhra Pradesh : ఆంధ్రప్రదేశ్‌పై కేంద్రం రీ-కాల్ అస్త్రం ప్రయోగిస్తుందా.?

Andhra Pradesh : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొందరు పోలీసు అధికారులపై కేంద్రం రీకాల్ అస్త్రాన్ని ప్రయోగించబోతోందట. ఈ విషయాన్ని టీడీపీ నుంచి బీజేపీలోకి దూకేసిన రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్ వెల్లడించారు. దీన్ని రాజకీయ జోస్యంగానే చూడాలా.? కేంద్రం నిజంగానే, ఆంధ్రప్రదేశ్ విషయంలో ‘రీకాల్’ అస్త్రాన్ని సిద్ధం చేసి ప్రయోగించబోతోందని అనుకోవాలా.?

ఇటీవల పార్లమెంటు సమావేశాల సమయంలో, రాష్ట్రంలోని పరిస్థితుల్ని కేంద్రానికి ఏపీ బీజేపీ నేతలు వివరించారట. అధికార పార్టీకి తొత్తులుగా కొందరు పోలీస్ అధికారులు వ్యవహరిస్తున్న వైనాన్ని కేంద్ర హోం శాఖ దృష్టికి ఏపీ బీజేపీ నేతలు తీసుకెళ్ళారట. అలాగని చెబుతున్నారు సీఎం రమేష్.

సీఎం రమేష్ అంటే ప్రస్తుతం బీజేపీ నేత. కానీ, టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడికి అత్యంత సన్నిహితుడు. టీడీపీకి ఆర్థికంగా వెన్నుదన్నుగా నిలిచారు గతంలో సీఎం రమేష్. సుజనా చౌదరి సంగతి సరే సరి. 2019 ఎన్నికల్లో టీడీపీ దారుణ పరాజయాన్ని చవిచూసిన దరిమిలా, చంద్రబాబుకి అత్యంత సన్నిహితులైన సీఎం రమేష్, సుజనా చౌదరి అత్యంత వ్యూహాత్మకంగా బీజేపీలోకి దూకేశారు.

అంతకు ముందు సుజనా చౌదరి, సీఎం రమేష్‌లపై సీబీఐ వంటి సంస్థలు పలు కేసులకు సంబంధించి విచారణలు, సోదాలు జరిపిన సంగతి తెలిసిందే. ఆ తర్వాతే, ఈ ఇద్దరూ బీజేపీ వైపుకు తిరిగారు. ఇలాంటోళ్ళు చేసే రాజకీయ పరమైన విమర్శలు, వ్యాఖ్యలకు విలువ వుంటుందా.? అసలు వీళ్ళకి మోడీ సర్కార్ అంత గౌరవం ఇస్తుందా.? అన్నదే మిలియన్ డాలర్ల ప్రశ్న.