కొండా సురేఖ కాంగ్రెస్ రాజకీయాలపై విజయం సాధిస్తారా.?

మాజీ మంత్రి కొండా సురేఖ, హుజూరాబాద్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేయబోతున్నారట. ఈ మేరకు ఆమె పేరుని తెలంగాణ కాంగ్రెస్ దాదాపు ఖాయం చేసిందట. ఆమె పేరుని అధిష్టానం దృష్టికి తీసుకెళ్ళిందట తెలంగాణ పీసీసీ. సో, కొండా సురేఖ పోటీ చేయడం ఖాయమేనన్నమాట. నిజానికి, హుజూరాబాద్ కంటే ముందుగా కొండా సురేఖ, కాంగ్రెస్ రాజకీయాల్ని గెలవాలి. కాంగ్రెస్ పార్టీలోని అంతర్గత కుమ్ములాటల్ని తట్టుకోవడమంటే అంత ఆషామాషీ వ్యవహారం కాదు. పైగా, కొండా సురేఖ.. ఏ పార్టీలో వున్నా, ఆ పార్టీలోని అంతర్గత కుమ్ములాటలకే రాజకీయంగా బలైపోతుంటారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో కొండా సురేఖ రాజకీయంగా ఎదిగారు. ఆ తర్వాత ఆమె చాలా పార్టీలు మారారు. వైఎస్ జగన్ వెంట నడిచారు, తెలంగాణ రాష్ట్ర సమితిలో చేరారు. కాంగ్రెస్ పార్టీలోకి వచ్చారు. నిజానికి, కొండా సురేఖ వెనుక బోల్డంత అనుచరగణం వుంది.

మంచి వాగ్ధాటి వున్న నాయకురాలామె. ఏం లాభం.? అన్నీ వున్నా అల్లుడి నోట్లో శని అన్న చందాన.. కొండా సురేఖ రాజకీయంగా ఎదగడానికి చాలా అడ్డంకులే ఎదురవుతున్నాయి ఎప్పటికప్పుడు. హుజూరాబాద్ నియోజకవర్గం నుంచి కొండా సురేఖ పోటీ చేయడమే నిజమైతే, కాంగ్రెస్ పార్టీకి అది చాలా పెద్ద అడ్వాంటేజ్. మాజీ మంత్రి ఈటెల రాజేందర్ కంటే ఆమె చాలా స్ట్రాంగ్ క్యాండిడేట్. ఆ మాటకొస్తే, తెలంగాణ రాష్ట్ర సమితి అభ్యర్థి కంటే కూడా కొండా సురేఖ పవర్ ఎక్కువ. కానీ, ముందు ఆమె కాంగ్రెస్ రాజకీయాల్ని తట్టుకోవాలి. ఆమె పేరు ఖరారు కాకముందు నుంచే, ఆమెకు వ్యతిరేకంగా కొన్ని స్వరాలు కాంగ్రెస్ పార్టీలో గొంతు లేపుతున్నాయి. ‘ఆమెకెలా టిక్కెట్ ఇస్తారు.?’ అంటూ కొందరు కాంగ్రెస్ నేతలు గుస్సా అవుతున్నారు. కొండా సురేఖను ఓడించి తీరతామని కూడా ఆ కాంగ్రెస్ నాయకులు శపథాలు చేసేస్తున్నారట. ఔను, కాంగ్రెస్ పార్టీకి వేరే శతృవులు అక్కర్లేదు.. ఆ పార్టీలోనే, ఆ పార్టీని ముంచేయడానికి చాలామందే వున్నారు.