Jagan Schemes : చంద్రన్న పథకాలు సరే, జగనన్న సంక్షేమ పథకాలు ఏమౌతాయ్.?

 Jagan Schemes : అప్పుల భారం ప్రజల నెత్తిన.. పథకాల పేరుతో ప్రచారమే నాయకులకా.? అన్న చర్చ ప్రజల్లో గట్టిగానే జరుగుతోంది. కానీ, ‘తప్పదు.. అధికారంలో ఎవరున్నా ఈ లత్కోర్ పంచాయితీ’ అనే భావన అయితే ప్రజల్లో రోజురోజుకీ బలపడుతోంది.

‘చంద్రబాబు హయాంలో వచ్చిన ఏ పథకమైనా ప్రజలకు గుర్తుందా అధ్యక్షా.?’ అంటూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అసెంబ్లీ సాక్షిగా ఎద్దేవా చేసేశారు.

వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో తెరపైకొచ్చిన ఆరోగ్యశ్రీ, ఫీజు రీ-ఎంబర్స్‌మెంట్ వంటి కొన్ని పథకాల్ని జనం అంత తేలిగ్గా మర్చిపోలేరు. అలాంటి సంక్షేమ పథకాలు ఇంకేమన్నా వున్నాయా.? అంటే, లేకనేం.. కుప్పలు తెప్పలుగా వున్నాయి. ఇంకా పుట్టుకొస్తూనే వుంటాయి.

చంద్రబాబు హయాంలో చంద్రన్న పేరుతోనూ, వైఎస్ జగన్ హయాంలో జగనన్న పేరుతోనూ ఆయా సంక్షేమ పథకాలు పుట్టుకురావడం.. అవి జనాల్లోకి వెళుతుండడం చూస్తూనే వున్నాం. అయితే, ఒకప్పటిలా సంక్షేమ పథకాల్ని జనం గుర్తుపెట్టుకునే పరిస్థితి లేదిప్పుడు.

ఆటో డ్రైవర్లకు అందించే ‘సాయం’ విషయానికొస్తే, ఆటో తీసుకుని రోడ్డెక్కగానే ఆ పథకం గురించి ఖచ్చితంగా మర్చిపోవడమే కాదు, దాన్ని ఛీత్కరించుకునే పరిస్థితి ఆటో డ్రైవర్లకే కలుగుతోంది. అంత అధ్వాన్నంగా రోడ్లు తయారయ్యాయ్.!

చెప్పుకుంటూ పోతే చాలానే వున్నాయ్ ఇలాంటివి. సంక్షేమ పథకాలతో అధికారంలో వున్నవారు చేస్తున్న ఓటు బ్యాంకు రాజకీయాలు జనానికి అర్థమవుతున్నాయ్. అందుకే, చంద్రబాబు తిరిగి అధికారం నిలబెట్టుకోలేకపోయారు.. ఎన్ని పబ్లిసిటీ స్టంట్లు చివరిదాకా చేసినా. మరి, వైఎస్ జగన్ పరిస్థితేంటి.? ఏమో, వచ్చే ఎన్నికలదాకా వేచి చూడాల్సిందే.