కేసీయార్‌కి హరీష్‌రావు ‘వెన్నుపోటు’ పొడవగలరా.?

అనవసరంగా కెలుక్కున్నారు తెలంగాణ మంత్రి హరీష్‌రావు. ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు తెలంగాణలోని అధికార పార్టీకి ఎందుకు.? పైగా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అధికార వైసీపీతో తెలంగాణ రాష్ట్ర సమితికి సన్నిహిత సంబంధాలే వున్నాయి. వాటిని చెడగొట్టుకునేలా హరీష్‌రావు ఎందుకు మాట తూలారో ఏమో.!

మొన్నామధ్య ఓ సందర్భంలో కేటీయార్ కూడా మాట తూలారు. వెంటనే సర్దుకున్నారు. ఆంధ్రప్రదేశ్ రోడ్ల గురించి కేటీయార్ ఓ ప్రైవేటు కార్యక్రమంలో సెటైరేసి, అడ్డంగా బుక్కయిపోయారు. కేటీయార్‌ని బీభత్సంగా ట్రోల్ చేశారు అప్పట్లో వైసీపీ మద్దతుదారులు సోషల్ మీడియా వేదికగా. ఆ దెబ్బకి కేటీయార్ దిగిరాక తప్పలేదు.

ఆ వ్యవహారం చూసి అయినా హరీష్‌రావు జాగ్రత్త పడొద్దా.? ఏపీలో ఉపాధ్యాయుల్ని అక్కడి ప్రభుత్వం కేసులు పెట్టి వేధిస్తోందని సెటైరేశారు హరీష్‌రావు. దానికి ఏపీ విద్యా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ ఆల్రెడీ కౌంటర్ ఎటాక్ చేసేశారు. అక్కడితో వైసీపీ ఆగలేదు. వైసీపీ ముఖ్య నేత, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి తనదైన స్టయిల్లో స్పందించారు.

‘కేసీయార్‌కీ, హరీష్‌రావుకీ ఏమైనా బేదాభిప్రాయాలు వుంటే.. వాళ్ళిద్దరూ తేల్చుకోవాలి. అంతేగానీ, కేసీయార్‌ని మాతో తిట్టించాలని హరీష్‌రావు అనుకోవడం అస్సలేం బాగాలేదు..’ అంటూ సజ్జల రామకృష్ణారెడ్డి వ్యాఖ్యానించారు. ఏదో చేద్దామనుకుంటే, ఇంకోటేదో అయ్యిందన్నట్లు.. ఏపీ మీద సెటైర్ వేయబోయి, టీఆర్ఎస్‌లోనే ప్రకంపనలకు తావిచ్చారు హరీష్‌రావు.

అసలే తెలంగాణలో బీజేపీ నుంచి టీఆర్ఎస్‌కి తలనొప్పి తీవ్రతరమవుతోంది. ఈ సమయంలో ఈ పొలిటికల్ వేషాలు అవసరమా.? వైసీపీతో సఖ్యతగా వుంటే, జగన్ మద్దతుదారులు టీఆర్ఎస్‌కి తెలంగాణలో కాస్తో కూస్తో ఓటేసే అవకాశం వుంటుంది. దాన్ని చెడగొట్టాలనుకోవడం వెనుక హరీష్ వ్యూహం, ప్రచారంలో వున్నట్లు ‘వెన్నపోటు’ రాజకీయమే అనుకోవాలా.? ‘ఎన్టీయార్‌కి చంద్రబాబు.. కేసీయార్‌కి హరీష్‌రావు..’ అంటూ మీమ్స్ అప్పుడే సోషల్ మీడియాలో దర్శనమిస్తున్నాయ్ మరి.