Ex Ministers : తాజా మాజీల్లో గెలిచేదెవరు.? వైసీపీని గెలిపించేదెవరు.?

Ex Ministers : ఈ రోజు మధ్యాహ్నం వరకూ వాళ్ళంతా మంత్రులు. కానీ, వాళ్ళిప్పుడు మాజీ మంత్రులు. తాజా మాజీ మంత్రులందరికీ పార్టీలో కీలక బాధ్యతలు అప్పగించనున్నట్లు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి హామీ ఇచ్చేశారు. నిజానికి, ఈ మాట గతంలోనే వైఎస్ జగన్ చెప్పారు.

మంత్రి పదవి.. పార్టీ పదవి.. అంతే తేడా.. మిగతాదంతా సేమ్ టు సేమ్.. అని కొడాలి నాని, పేర్ని నాని తదితరులు చెబుతున్నారు.

అంతా బాగానే వుందిగానీ, పార్టీ పదవులు ఎవరెవరికి దక్కుతాయి.? ఎవరెవరు పార్టీని మళ్ళీ గెలిపించే సత్తా వున్నోళ్ళు.? ఎవరెవరికి మళ్ళీ గెలిచే సత్తా వుంది.? ఈ అంశాలపై రాజకీయ వర్గాల్లో చర్చ షురూ అయ్యింది.

ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని వెనకేసుకురావడంలో దాదాపు 50 శాతం మంది మంత్రులు సక్సెస్ అవుతూ వచ్చారు.

కానీ, చాలామంది మంత్రులు.. మీడియా ముందు పెద్దగా కనిపించేవారు కాదు, జనంలోకి అసలు వెళ్ళేవాళ్ళే కాదు. అలా చూసుకుంటే, ప్రజలతో సంబంధం లేని మంత్రులే (ఇప్పుడు మాజీలైపోయార్లెండి) ఎక్కువమంది వున్నారు జగన్ చుట్టూ.

అదే అసలు సమస్య. మరి, అలాంటోళ్ళు పార్టీని ఎలా గట్టెక్కిస్తారు.?

వాస్తవానికి, రాష్ట్ర ప్రజల్లో చాలామందికి ఎవరు మంత్రులు.? అన్నదానిపై స్పష్టత లేదు. 24 మంది మంత్రులంటే అలాగే వుంటుంది. హోంమంత్రిగా బాధ్యతలు నిర్వహించిన మేకతోటి సుచరిత సైతం కార్యకర్తలకు ఏనాడూ అందుబాటులో లేరు, అసలు ప్రజలతోనూ ఆమె మమేకం కాలేకపోయారు.

పేరుకే ఉప ముఖ్యమంత్రులు.. వారిలో చాలామందికి ప్రజలతో సంబంధాల్లేవనే చర్చ వైసీపీలోనే జరుగుతోంది. ధర్మాన కృష్ణదాస్ ఒక్కరూ కాస్త బెటర్ అంతే. ఇదీ వాస్తవ పరిస్థితి. మరి, కొత్తగా మంత్రులయ్యేవారైనా.. పార్టీకీ, ప్రభుత్వానికీ పనికొచ్చేలా వుంటారా.? వేచి చూడాల్సిందే.