Chandrababu Warn Nara Lokesh : టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు, తన పుత్రరత్నం నారా లోకేష్.. తెలుగుదేశం పార్టీ బాధ్యతలకు దూరంగా వుంచుతారా.? అబ్బే, అలాంటి పరిస్థితే వుండదు. అయినాగానీ, సీనియర్లలో కొందరి మాటకు విలువ ఇచ్చి, నారా లోకేష్ అధికారాల విషయంలో చంద్రబాబు ‘కీలక నిర్ణయం’ తీసుకునే అవకాశాలున్నాయంటున్నారు.
2019 ఎన్నికల్లో టీడీపీ ఓటమికి చాలా కారణాలున్నాయి. అందులో ఓ కీలక కారణం నారా లోకేష్. మంగళగిరి నియోజకవర్గంలో టీడీపీ పట్ల సానుకూలత వున్నాగానీ, నారా లోకేష్ వ్యవహార శైలి నేపథ్యంలో పార్టీ ఓడిపోయిందని అధినేత చంద్రబాబుకి తెలియకుండా వుంటుందా.?
టిక్కెట్ల కేటాయింపు విషయమై చినబాబు అత్యుత్సాహం కూడా టీడీపీ కొంప ముంచేసింది. ఎలా చూసుకున్నా, 2019 ఎన్నికల్లో టీడీపీ ఓటమికి సంబంధించి నారా లోకేష్ మీదనే చాలా ఆరోపణలు వున్నాయి. అదే, 2024లో రిపీట్ అయితే.? ఆ ఆలోచననే చంద్రబాబు తట్టుకోలేకపోతున్నారు.
‘నారా లోకేష్ కారణంగానే పార్టీ భ్రష్టుపట్టిపోయింది..’ అన్న భావన చాలామంది టీడీపీ నేతల్లో వుంది. అది రోజురోజుకీ బలపడుతోంది తప్ప, బలహీన పడటంలేదు. ఈ నేపథ్యంలో నారా లోకేష్ కొన్ని కీలకమైన అంశాలకు దూరంగా వుంటే మంచిదని చంద్రబాబు కూడా భావిస్తున్నారట.
ఏమో, ఈ ప్రచారంలో నిజమెంతోగానీ.. తనకంటూ ఓ బలమైన టీమ్ టీడీపీలో ఏర్పాటు చేసుకున్న నారా లోకేష్, అధినేత చంద్రబాబు తన అధికారాలకు కత్తెర వేస్తే ఊరుకుంటారా.?