Bunny :స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ఐకాన్ స్టార్‌గా మారి ‘పుష్ప’ సినిమాతో పాన్ ఇండియా ప్రేక్షకుల్ని ఈ నెల 17న పలకరించనున్న సంగతి తెలిసిందే. సుకుమార్ దర్శకత్వంలో రూపొందిన ‘పుష్ప’ సినిమాలో అల్లు అర్జున్ సరసన రష్మిక మండన్న హీరోయిన్‌గా నటించింది. అనసూయ భరద్వాజ్, సునీల్, ఫహాద్ ఫాజిల్ తదితరులు ఇతర ప్రధాన తారాగణం.
అల్లు అర్జున్‌కి తెలుగుతోపాటు మలయాళ సినీ ప్రేక్షకుల్లోనూ మంచి ఫాలోయింగ్ వుంది. అల్లు అర్జున్ డబ్బింగ్ సినిమాలకి హిందీలోనూ క్రేజ్ వున్నమాట వాస్తవం. అయితే, డైరెక్ట్‌గా హిందీలో అల్లు అర్జున్ సినిమా ఇంతవరకూ విడుదలై హిట్టు కొట్టింది లేదు.
‘పుష్ప’ సినిమాతో పాన్ ఇండియా సూపర్ స్టార్ అనిపించుకోవాలని అల్లు అర్జున్ తహతహలాడుతున్నాడు. ఈ నేపథ్యంలోనే అల్లు అర్జున్, తోటి హీరోలందర్నీ కలుపుకుపోతున్నాడు.. సీనియర్ హీరోల జపం చేస్తున్నాడు. సినిమా రంగం కరోనా కారణంగా ఎదుర్కొంటున్న సమస్యల నేపథ్యంలో, ఏ హీరో అయినా ఇలాగే ఆలోచించాలి కూడా.
నందమూరి బాలకృష్ణ నటించిన ‘అఖండ’ సినిమా ఇటీవల విడుదలై ఘనవిజయాన్ని అందుకుంది. ఆ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ముఖ్య అతిథి అల్లు అర్జున్. అలాగే, ప్రభాస్ సినిమాల గురించీ, ఇతర హీరోల సినిమాల గురించీ అల్లు అర్జున్ పదే పదే ప్రస్తావిస్తున్నాడు, అన్ని సినిమాలూ బాగా ఆడాలని కోరుకుంటున్నాడు.
అల్లు అర్జున్ పడుతున్న తాపత్రయాన్ని అభినందించాల్సిందే. అయితే, ఈ తాపత్రయం ఎంతవరకు ఫలిస్తుంది.? ఆయా హీరోల అభిమానులు, ‘పుష్ప’ సినిమాకి అండగా నిలుస్తారా.? అసలు, ‘పుష్ప’ ప్రీ రిలీజ్ ఈవెంట్ కోసం, ఆయా హీరోల్ని ఎందుకు బన్నీ తీసుకురాలేకపోయాడు.? ఏమో, ఈ ప్రశ్న ఇప్పుడు అల్లు అర్జున్ సైన్యానికి అస్సలు మింగుడపడ్డంలేదు.