టీడీపీతో బీజేపీ సంప్రదింపులు మొదలు కానున్నాయా.?

రాజకీయాల్లో శాశ్వత శతృవులు, శాశ్వత మిత్రులు ఎవరూ వుండరు. రాజకీయమంటేనే కలగాపులగం. రాజకీయమంటేనే కప్పల తక్కెడ. ఆ పార్టీ నుంచి ఈ పార్టీలోకి, ఈ పార్టీ నుంచి ఇంకో పార్టీలోకి రాజకీయ నాయకులు నిస్సిగ్గుగా దూకేస్తున్న రోజులివి. సిద్దాంతాలు, చింతకాయ.. అవేవీ లేవిక్కడ.

వైసీపీ జెండా మెడలో వేసుకుని టీడీపీని తిడతారు, ఆ తర్వాత టీడీపీ కండువా మెడలోకి రాగానే వైసీపీని తిడతారు. ఇదే రాజకీయమంటే.  ఈమాత్రందానికి జనాల్ని ఎందుకు వెర్రి వెంగళప్పల్ని చేయాలి.? అంటే, రాజకీయం అంటేనే అలా వుంటుంది. రాజకీయం అంటే సేవ కాదు, ప్రజల్ని మోసం చేయడమే రాజకీయం.!

బీజేపీ – టీడీపీ మధ్య నిన్న మొన్నటిదాకా ఎంత యాగీ జరిగిందో చూశాం. ‘మీ అంతు చూస్తా..’ అని చంద్రబాబు హెచ్చరించారు 2019 ఎన్నికలకు ముందు బీజేపీని. కానీ, ఇప్పుడు సీన్ మారింతి. చంద్రబాబు మాత్రమే కాదు, వైసీపీ కూడా బీజేపీ మెడలు వంచేస్తామని చెప్పింది. కానీ, బీజేపీ ముందు వైసీపీ మెడలు వంచేసుకుంటోంది.

అసలు విషయంలోకి వస్తే, బీజేపీ – టీడీపీ మధ్య పొత్తు చిగురించబోతోందట. టీడీపీతో మేం పొత్తు పెట్టుకుంటే, టీడీపీ తరఫున, మా తరఫున ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారా.? లేదా.? అని సినీ నటుడు జూనియర్ ఎన్టీయార్‌ని నేరుగా అమిత్ షా అడిగేశారన్నది తాజాగా రాజకీయ వర్గాల్లో వినిపిస్తోన్న గుసగుస.

‘మీరెలాగూ పవన్ కళ్యాణ్ వీరాభిమాని కదా.. జనసేన పార్టీ తరఫున, బీజేపీ తరఫున తెలంగాణలో ప్రచారం చేస్తారా.?’ అని హీరో నితిన్‌ని బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా అడిగేశారట. టీడీపీకి రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడెలా వుంది.? అన్నదానిపై రామోజీతో కేంద్ర హోంమంత్రి అమిత్ షా వాకబు చేశారట.

ఈ చర్చోపచర్చలన్నీ టీడీపీ కనుసన్నల్లోనే జరుగుతున్నాయట. రేపో మాపో చంద్రబాబు, బీజేపీ అధిష్టానంతోనూ సంప్రదింపులు చేస్తారట. టీడీపీ – బీజేపీ పొత్తు దాదాపు ఖాయమైపోయిందనీ, త్వరలోనే ఎన్డీలో బీజేపీ చేరిపోతుందనీ ప్రచారం జరుగుతోంది. ఇందులో నిజమెంత.? అదైతే ప్రస్తుతానికి సస్పెన్స్.