పవన్ కళ్యాణ్ కొత్త సినిమా ‘వకీల్ సాబ్’ విషయంలో ఆంధ్రపదేశ్ రాష్ట్రంలోని అధికార ‘అనుమతులు నిరాకరించడం’పై సర్వ్రతా విమర్శలు వెల్లెవెత్తుతున్న సంగతి తెలిసిందే. బెనిఫిట్ షోలు, టిక్కెట్ ధరల పెంపు.. వంటి విషయాలపై జగన్ సర్కార్, ‘కుట్రలకు’ తెరలేపిందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీపై విమర్శలున్నాయి. దీన్ని రాజకీయ కోణంలో సినీ అభిమానులు చూస్తే, అదో అంశం. మరి, రాజకీయ నాయకులు.. ఓ సినిమా వివాదాన్ని రాజకీయం చేయడం ఎంతవరకు సబబు.? అన్నదే చర్చ. బీజేపీ సీనియర్ నేత సునీల్ దేవధర్, ఓ సినిమా థియేటర్ ముందు నిల్చుని, ‘సినిమాకే భయపడితే.. బీజేపీ – జనసేన కలిసి, రియల్ రాజకీయం చూపిస్తే మీ పరిస్థితి ఏమవుతుందో..’ అని ప్రశ్నించడం అందర్నీ విస్మయానికి గురిచేస్తోంది.
తిరుపతి ఉప ఎన్నికలో బీజేపీ, డిపాజిట్లు తెచ్చుకుంటే అది చాలా గొప్ప విషయమనే చర్చ రాజకీయ విశ్లేషకుల్లో జరుగుతున్న సంగతి తెలిసిందే. జనసేన మద్దతివ్వకపోతే, నోటాని కూడా బీజేపీ దాటే అవకాశం లేదు. సరే, రాజకీయాల్లో నిన్నటి ఈక్వేషన్లకి, నేటి ఈక్వేషన్లకీ చాలా తేడా వుండొచ్చు. అది ఇంకో చర్చ. తిరుపతిలో ఇటీవల పవన్ కళ్యాణ్ పర్యటించి జనసేన బలపరిచిన బీజేపీ అభ్యర్థి తరఫున ప్రచారం చేసిన సమయంలో కూడా బీజేపీ నేతలు, ‘వకీల్ సాబ్’ సినిమా గురించి ఎక్కువగానే మాట్లాడారు. అది రాజకీయ సభ. ఆ వేదికపై సినిమా చర్చ ఎంతవరకు సబబు.? జనసేన బలపరిచిన బీజేపీ అభ్యర్థితో సహా అందరూ సినిమా డైలాగులు చెప్పడమే అప్పట్లో విమర్శలకు తావిచ్చింది. ఇప్పుడు ఇంకో అడుగు ముందుకేసి సునీల్ దేవధర్ థియేటర్ ముందు నిల్చుని జగన్ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ, ఆ వీడియో సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం ఆశ్చర్యకరం.