Ballayya Resign As MLA : లేస్తే మనిషిని కాదు.. అన్నాడట వెనకటికి ఒకడు. అచ్చం అలాగే వుందిప్పుడు సినీ నటుడు, టీడీపీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ వ్యవహారం. తనను గెలిపించిన హిందూపురం నియోజకవర్గ ప్రజలకు అస్సలేమాత్రం అందుబాటులో వుండరు బాలయ్య. ఆర్నెళ్ళకో ఏడాదికో మాత్రమే హిందూపురం వెళ్ళి వస్తుంటారు.. అది కూడా ఏదో ఒక షో చెయ్యడానికే.
తాజాగా హిందూపురం వెళ్ళిన నందమూరి బాలకృష్ణ, హిందూపురం కేంద్రంగా కొత్త జిల్లా.. అంటూ నానా యాగీ చేసి పారేశారు. అభిమానుల కేరింతల నడుమ, బాలకృష్ణ తెలుగులోనూ, హిందీలోనూ ప్రసంగించేసి.. ఏవేవో డైలాగులు చెప్పేశారు. పనిలో పనిగా, కొన్ని ఆంగ్ల పదాలు కూడా అవలీలగా దొర్లేశాయంతే బాలయ్య నోట.!
హైలైట్ అంశం ఏంటంటే, నందమూరి బాలకృష్ణ రాజీనామా చేసేస్తాననడం. చేసెయ్యొచ్చగా, ఆలస్యమెందుకు.? అని హిందూపురం ప్రజలు బాలయ్యకు సలహా కూడా ఇచ్చేస్తున్నారు. ఇదొక్కటి చాలు, నియోజకవర్గ ప్రజలు ఎంతలా బాలయ్య తీరు పట్ల విసిగిపోయారో చెప్పడానికి.
హిందూపురం జిల్లా కేంద్రం కాకపోతే, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానన్నది బాలయ్య చేసిన వ్యాఖ్యల సారాంశం. అన్నట్టు, హిందూపురం ఎంపీ కనిపించడంలేదని బాలయ్య సెటైర్లు కూడా వేసేశారు.. అక్కడికేదో బాలయ్య నిత్యం హిందూపురం ప్రజలకు అందుబాటులో వుంటున్నట్టు.
వైసీపీ నేత, హిందూపూర్ ఎంపీ గోరంట్ల మాధవ్.. నియోజకవర్గ ప్రజలకు అందుబాటులోనే వుంటున్నారు. తరచూ ఆయన హిందూపురం లోక్ సభ నియోజకవర్గంలోనే ప్రెస్ మీట్లు కూడా పెడుతుంటారు. వైసీపీ ఎమ్మెల్సీ ఇక్బాల్ కూడా హిందూపురం అసెంబ్లీ నియోజకవర్గంలో ప్రజలకు అందుబాటులోనే వున్నారు.
ఎటొచ్చీ బాలయ్యతోనే తంటా. ఆయనే నియోజకవర్గం వైపు పెద్దగా చూడరు. ఇప్పుడొచ్చి నానా యాగీ చేసి వెళుతోన్న బాలయ్య మళ్ళీ ఎప్పుడు నియోజకవర్గ ప్రజలకు కనిపిస్తారో ఏమో.! ఇంతకీ, బాలయ్య నిజంగానే రాజీనామా చేసేస్తారా.? అంత సీన్ ఆయనకెక్కడిది.?