మోడీ నుంచి ‘సానుకూల స్పందన’ చంద్రబాబుకి లభిస్తుందా.?

తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడు, తెలుగు నాట టీడీపీకి పాతరేశారన్న విమర్శ సొంత పార్టీ నేతల నుంచే వినిపిస్తోంది. రాజకీయంగా చంద్రబాబు తీసుకుంటున్న చాలా నిర్ణయాలు బెడిసికొడుతున్నాయి.. దాంతో, టీడీపీ దారుణంగా దెబ్బ తినేసింది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో టీడీపీ ఇప్పుడు ఉనికి కోసం ఆరాట పడాల్సిన పరిస్థితి. తెలంగాణలో అయితే, దాదాపుగా జెండా పీకేసినట్టే.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విషయానికొస్తే, టీడీపీ పరిస్థితి వెంటిలేటర్ మీదున్నట్టుంది. అయినాగానీ, చంద్రబాబు ఘీంకారాలు తగ్గడంలేదు. 2024 ఎన్నికల నాటికి పుంజుకోవాలంటే, చంద్రబాబుకి బలమైన స్నేహ హస్తం అవసరం. అది నరేంద్ర మోడీదే అయితే బావుంటుందన్న భావన చంద్రబాబులో వుంది. కానీ, అప్పటికి కేంద్రంలో బీజేపీ పరిస్థితి ఎలా వుంటుందోనన్న చిన్నపాటి సంశయం చంద్రబాబుని కాస్త వెనక్కి లాగుతోందట. అయినాగానీ, ఢిల్లీ స్థాయిలో బీజేపీ పెద్దలతో తన వేగులతో మంతనాలు జరుపుతూనే వున్నారట చంద్రబాబు.

ఒకవేళ కేంద్రంలో కాంగ్రెస్ నేతృత్వంలోని కూటమి అధికారంలోకి వస్తేనో.? అన్న దిశగా అటు వైపుగా చంద్రబాబు ప్రయత్నాలు సాగిస్తున్నారని తెలుస్తోంది. నిజానికి, ఏపీలో బీజేపీతో కలిసి నడవడం వల్ల చంద్రబాబుకి పెద్దగా రాజకీయ ప్రయోజనం వుండదు. ఎందుకంటే, బీజేపీకి ఏపీలో అసలు ఓటు బ్యాంకు లేదు. పోనీ, జనసేనతో కలిసి వెళదామా.? అంటే, జనసేన అందుకు ససేమిరా అంటోంది. ‘జనసేన మాకు మిత్ర పక్షం లాంటిదే..’ అని టీడీపీ నేతలు ఇంకా చెప్పుకుంటూనే వున్నారు. అదే జనసేనకు పెను శాపంగా మారుతోంది.

చంద్రబాబుతో స్నేహం ఎవరికైనా కష్టకాలాన్నే తెచ్చిపెడుతుంది. కాంగ్రెస్ ఖతం అయిపోయిందీ, ఏపీలో బీజేపీ నాశనమయ్యిందీ.. చంద్రబాబుతో స్నేహం కారణంగానే. నిజానికి, జనసేన కూడా 2019 ఎన్నికల్లో అంత దారుణమైన ఫలితాన్ని చూడటానికి.. టీడీపీనే కారణం. టీడీపీతో పోల్చితే జనసేనకు వైసీపీ పట్ల కొంత సానుకూలంగా వుండడం బెటర్.. అనుకోవాలేమో. కానీ, అందుకు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సమ్మతించరు. మొత్తమ్మీద, 2024 ఎన్నికల నాటికి ఏపీలో పొలిటికల్ ఈక్వేషన్ ఎలాగైనా మారే అవకాశాలున్నాయన్నమాట. ఇంతకీ, బాబుగారి ప్రయత్నాలు వర్కవుట్ అవుతాయా.? మోడీ ఆయనకు స్నేహ హస్తం అందిస్తారా.? వేచి చూడాల్సిందే.