Cinema Theatres : సినిమా థియేటర్లన్నీ మూతపడబోతున్నాయా.?

Cinema Theatres : సినిమా.. సినిమా.. సినిమా.. ఇది తప్ప ఇంకో చర్చే లేకుండా పోయింది తెలుగు రాష్ట్రాల్లో. రాజకీయాలన్నీ సినిమా చుట్టూనే తిరుగుతున్నాయి. తెలంగాణ కాస్త బెటర్.. తెలంగాణ రాజకీయాలు వేరు. ఆంధ్రప్రదేశ్ అలా కాదు, సినిమా చుట్టూనే.. ఆంధ్రప్రదేశ్ రాజకీయం నడుస్తోంది. కారణం, సినిమా టిక్కెట్ల ధరలే.

‘అఖండ’, ‘పుష్ప’ సినిమాల విషయంలో టిక్కెట్ల గోల పెద్దగా వినిపించలేదు. కానీ, ‘శ్యామ్ సింగరాయ్’ సినిమాకొచ్చేసరికి సీన్ మారిపోయింది. ‘బ్యాన్ శ్యామ్ సింగరాయ్’ అంటున్నారు వైసీపీ అభిమానులు. ‘వి సపోర్ట్ నాని’ అంటున్నారు నాని అభిమానులు.

ఇంకోపక్క, నిబంధనల ఉల్లంఘన నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్‌లో పలు థియేటర్లు మూతబడుతున్నాయి. ఈ మూసివేత తాత్కాలికమే అయినా, ఆ ప్రభావం చాలా ఎక్కువగానే వుండబోతోంది. లైసెన్సుల్ని పునరుద్ధరించుకుని, ఎలాంటి అభ్యంతరాల్లేకుండా సినిమా థియేటర్లను తెరచుకోవాలని అధికారులు చెబుతున్నారు.

కాగా, సినిమా టిక్కెట్ ధరల విషయమై లొల్లి మాత్రం తారాస్థాయికి చేరుకుంటోంది. ఇంకోపక్క, ఒమిక్రాన్ భయాలు వెంటాడుతున్నాయి. రానున్న సంక్రాంతి సీజన్ ఏమవుతుంది.? పెద్ద సినిమాలు ఏమౌతాయ్.? ఏమోగానీ, ఈలోగా నాని కెలుకుడు కారణంగా ఇతర సినిమాలపైనా తీవ్ర ప్రభావం పడేలానే వుంది.

థియేటర్ల యాజమాన్యాలు గనుక లైసెన్సుల్ని పునరుద్ధరించుకోకపోతే, చాలా సినిమాలు దెబ్బతింటాయి. ఇదిలా వుంటే, పదుల సంఖ్యలో.. కాదు, వందల సంఖ్యలో థియేటర్లు స్వచ్ఛందంగా మూతబడ్తాయంటూ సోషల్ మీడియా వేదికగా జరుగుతున్న ప్రచారంలో నిజమెంతో ఏమోగానీ.. పరిశ్రమలో ఈ ప్రచారం మరింత భయాన్ని కలిగిస్తోంది.