భర్తను చంపి ఇంట్లో పూడ్చిపెట్టిన భార్య..! పోలీసులే విస్తుపోయే నిజాలు..

రెండు రోజుల క్రితం హైదరాబాద్ లో వెలుగులోకి వచ్చిన భర్తను చంపి ఇంటి వెనుక పూడ్చి పెట్టిన భార్య ఉదంతంలో కొత్త కోణాలు వెలుగులోకి వచ్చాయి. సంచలనం రేపిన ఈ ఘటనలో పోలీసుల విచారణలో నిందితురాలు ఆసక్తికరమైన విషయాలు వెల్లడించింది. భర్తను తానే చంపినట్టు అంగీకరించింది. ఇందుకు తానేమీ పశ్చాత్తాప్పడటం లేదని.. పిల్లలు అనాధలయ్యారని మాత్రం బాధగా ఉందని చెప్పింది. గగన్ ను పెళ్లి చేసుకుని తప్పు చేసానని.. అతడొక మృగం అని చెప్పుకొచ్చింది. ఆమె నిజాలు చెప్తున్న తీరుకు విస్తుపోవడం పోలీసుల వంతు అయింది. పూర్తి వివరాల్లోకి వెళ్తే..

హైదరాబాద్ లోని పాతబస్తీ యాకత్ పురాలో నివాసం ఉండే నౌసిన్ బేగం అనే 32 ఏళ్ల మహిళ భర్తతో విబేధించి విడాకులు తీసుకుంది. ఈమెకు నలుగురు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. పిల్లలతో కలిసి వేరుగా ఉంటోంది. ఈక్రమంలో నౌసీన్ కు 38 ఏళ్ల గగన్ అగర్వాల్ పరిచయమయ్యాడు. గగన్ కూడా భార్యకు విడాకులు ఇచ్చి ఉండటంతో వీరిద్దరి పరిచయం ప్రేమగా మారింది. గతేడాది జూన్ లో వివాహం చేసుకుని అయిదుగురు పిల్లలతోసహా వివేకానందనగర్ కాలనీలో కాపురం పెట్టారు. కొన్నాళ్ల తర్వాత నౌసీన్ నలుగురు కుమార్తెల్లో ఇద్దరిని వేధించడం మొదలుపెట్టాడు గగన్. చివరకు ఆరేళ్ల చిన్నారితో కూడా అసభ్యకరంగా ప్రవర్తించడంతో నౌసీన్ తట్టుకోలేకపోయింది.

 

అయితే.. వీరి ఇంటికి తరచుగా వచ్చే గగన్ స్నేహితుడు సునీల్ అగర్వాల్ తో నౌసీన్ తన బాధను చెప్పుకుంది. ఈక్రమంలో ఫిబ్రవరి 8న ఇంట్లోనే గగన్, సునీల్ ఇద్దరూ కలసి మద్యం సేవించారు.  మద్యం మత్తులో గగన్ మళ్లీ తన భార్యతో గొడవపడ్డాడు. గగన్ పూర్తిగా మత్తులో ఉండడం.. గగన్ పై అప్పటికే విపరీతమైన కోపం ఉండటంతో చంపేయాలని నిర్ణియించుకుంది. మద్యం తాగుతున్న గగన్ గొంతులో కత్తితో పొడిచింది. బాధతో విలవిల్లాడుతున్న గగన్ పై మరిన్ని కత్తిపోట్లు పొడిచి హత్య చేసింది. ఇది చూసి సునీల్ హతాశుడయ్యాడు. మృతదేహాన్ని ఇంటి వెనుకే సెప్టిక్ ట్యాంక్ కోసం తీసిన గోతిలో రాళ్లు, కంకర, ఇటుకముక్కలు వేసి పూడ్చిపెట్టింది. ఆపై భర్త కనిపించడంలేదని పోలీసులకు ఫిర్యాదు చేసింది. అనంతరం పిల్లలతో సహా పుట్టింటికి వెళ్లిపోయింది.

 

నౌసీన్ ప్రతిరోజూ ఇంటికి వస్తూ ‘ఇంట్లో పిల్లి ఉంది.. పాలు పోయాలి‘ అంటూ పొరుగువారితో చెప్పేది. భర్తను పూడ్చిన గుంతపై రోజూ నీళ్లు పోసేది. నౌసీన్ పై అనుమానం వచ్చిన పోలీసులు విచారించగా భర్తను హతమార్చినట్టు అంగీకరించింది. హత్య తానే చేశానని.. సునీల్ మృతదేహం పూడ్చేందుకు మాత్రం సాయం చేశాడని తెలిపింది. సునీల్ ను పోలీసులు అరెస్టు చేశారు.