అనేక అంచనాలు, ఊహాగానాలు, ఉత్కంఠ నడుమ వైఎస్ జగన్ ఢిల్లీ పర్యటన పూర్తైంది. ఈ పర్యటనతో రాష్ట్ర రాజకీయాల్లో పెను మార్పు చోటు చేసుకుంటుందని, తెలుగుదేశం పార్టీలో తుఫాను పుడుతుందని చాలామంది భావించారు. వైఎస్ జగన్ మోదీతో ఎన్డీయేలో చేరే విషయమై చర్చలు జరుపుతారని, చేతులు కలపడం ఖాయమని పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. మరోవైపు విపక్షాలేమో జగన్ ఢిల్లీ వెళుతున్నది తన కేసుల విషయమై మోదీతో లోపాయికారీ ఒప్పందాలు చేసుకోవడానికని విమర్శలు గుప్పించాయి. ఈ రకరకాల అంచనాలతో అసలు జగన్ ఢిల్లీ ఎందుకు వెళ్లారో తెలుసుకోవాలని రాష్ట్ర ప్రజలు చాలా ఆసక్తిగా ఎదురుచూశారు.
కానీ అందరూ చెప్పినట్టు, ఏవేవో ఊహించుకున్నట్టు అక్కడ ఏమీ జరగలేదని అనిపిస్తోంది. చివరిసారి ఢిల్లీ పర్యటనే కొంత రంజకంగా ఉండగా ఈసారి పర్యటనలో అసలేం జరిగిందనే విషయం మీద క్లారిటీయే లేదు. మామూలుగా సీఎం ఢిల్లీ వెళ్లి ప్రధానిని కలిస్తే ప్రభుత్వ వర్గాలు, సీఎం పిఆర్ టీమ్ లేదా అధికార పార్టీ కీలక నేతలు, అనుకూల మీడియా పూర్తి వివరాలను బయటపెడతారు. ఒకవేళ వెళ్ళిన పని సూపర్ సక్సెస్ అయితే ఆ ప్రచారం వేరే లెవల్లో ఉంటుంది. కానీ వైసీపీ ముఖ్య నేతల నుండి కానీ వారి అనుకూల మీడియా నుండి కానీ పెద్దగా హడావిడీ లేదు. కేవలం రాష్ట్ర ప్రయోజనాల కోసం మోదీకి నివేదించినట్లు మాత్రమే చెప్పుకొచ్చారు.
ఇక జగన్ వెంటే ఢిల్లీ వెళ్లి ప్రధానిని కలిసిన విజయసాయిరెడ్డి అయితే ప్రధాని నరేంద్ర మోదీజీతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిగారి భేటీ ఫలప్రదంగా జరిగింది. రాష్ట్రానికి పూర్తి సహాయ సహకారాలు అందిస్తామని ప్రధాని హామీ ఇచ్చారు అంటూ ట్వీట్ వేశారు. అంతేకానీ జగన్ అందుకున్న ఆ హామీ ఫలాలు, ఏమిటో మాత్రం రివీల్ చేయలేదు. ముందుగా అందరూ అన్నట్టు ఎన్డీయేలో చేరే విషయం మీదే జగన్ ఢిల్లీ వెళ్లి ఉంటే తప్పకుండా మోదీ నుండి అంగీకారం, రావాల్సిన హామీలు వచ్చేవి. నూటికి నూరు శాతం కాకపోయినా 70 శాతం వరకైనా టూర్ సక్సెస్ అయ్యేది. అదే జరిగి ఉంటే విజయసాయిరెడ్డిగారి ట్వీట్లు వేరే రకంగా ఉండేవి. దీన్నిబట్టి నిన్నటి సమావేశంలో ఎన్డీయేలో చేరిక మీద చర్చ జరగలేదని అర్థం చేసుకోవాలేమో.