ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ న్యాయవ్యవస్థల మీద గుర్రుగా ఉన్నారు. రాష్ట్రంలో న్యాయ వ్యవస్థ పనితీరు మీద అసంతృప్తి వ్యక్తం చేస్తూ సుప్రీంకోర్డు జడ్జి జస్టిస్ ఎన్వీ రమణ చంద్రబాబు నాయుడుకు సానుకూలంగా వ్యవహరిస్తూ ఏపీలో ప్రభుత్వాన్ని అస్థిరపరిచే కుట్ర చేస్తున్నారని నేరుగా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎస్‌ఎ బాబ్డేకు లేఖ రాశారు. ఇలా ప్రధాన నాయమూర్తి రేసులో ఉన్న ఎన్వీ రమణ మీద జగన్ తీవ్ర ఆరోణలు చేయడం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఇప్పటివరకు ఎందరో ముఖ్యమంత్రులు ఎన్నో సాహసోపేతమైన పనులను చేశారు. కానీ ఇలా న్యాయవ్యవస్థ మీద దండెత్తింది మాత్రం జగన్ ఒక్కరే.
వైసీపీ నేతలు, ఆయన అనుకూల మీడియా మొత్తం జగన్ చర్యను గొప్పదిగా, చరిత్రలో నిలిచిపోయేదిగా అభివర్ణిస్తుంటే, ప్రతిపక్షాలు రాజకీయ, న్యాయ విశ్లేషకులు మాత్రం జగన్ న్యాయవ్యవస్థ మీద దాడి చేస్తున్నారని, ఇది రాజ్యాంగాన్ని కించరపరచడమేనని విమర్శిస్తున్నారు. ఈ భిన్నాభిప్రాయాలు సంగతి అలా ఉంచితే జగన్ ఇప్పుడే జస్టిస్ ఎన్వీ రమణ మీద ఆరోపణలు ఎందుకు చేయాల్సి వచ్చిందనేది పెద్ద ప్రశ్న. ప్రభుత్వం తీసుకుంటున్న ప్రతి నిర్ణయానికి కోర్టులు అడ్డుపడుతున్నాయని, దాని వెనుక చంద్రబాబు ఉన్నారని జగన్ ఆరోపిస్తున్నారు. ఆయన అంటున్నది నిజమా కాదా అనేది పక్కనబెడితే ఆయన ఆరోపణలు చేస్తున్నది న్యాయవ్యవస్థ మీదనే సంగతి అందరూ గుర్తుంచుకోవాలి.
జగన్ కోపం ఏదో ఒక ఇండివిడ్యువల్ వ్యక్తి మీదనో లేకపోతే వేరొక రాజకీయ నాయకుడు మీదనో, ప్రత్యర్థి పార్టీ మీదనో అయితే ఆయన మంత్రులు, ఇతర ఎమ్మెల్యేలు తమ ఇష్టం వచ్చిన వ్యాఖ్యలు చేయవచ్చు. ఎలాగో తిట్ల సంప్రదాయం ఒకటి అనధికారికంగా అధికారికం అయ్యుంది కాబట్టి తిట్టేసుకోవచ్చు కూడ. దానికెవరూ బాధపడరు. కానీ వైసీపీ నేతలు కోర్టుల మీదే నోటి దురుసు ప్రదర్శించారు. మీడియా ముందుకొచ్చి అసలు కోర్టులకు తమని ఆపే హక్కు ఎవరిచ్చారని మాట్లాడారు. ఫ్లెక్సీలు పెట్టి మరీ వార్నింగ్ ఇచ్చారు. ఇక సోషల్ మీడియాలో అయితే నరుకురతామన్న వైసీపీ కార్యకర్తలు కూడ ఉన్నారు. వీరి చర్యలను చూసి హైకోర్టు నోటీసులిచ్చిందంటే అర్థంచేసుకోవాలి అక్కడ ఎంత పెద్ద తప్పు జరిగిందో.
ఇక బాధ్యతాయుతమైన పదవిలో ఉన్న స్పీకర్ గారైతే తాను స్పీకర్ అనే విషయాన్ని మర్చిపోయి మామూలు రాజకీయ నాయకుడిలా న్యాయవ్యవస్థ మీద, ఇతర అంశాల విషయంలోనూ విరుచుకుపడిపోయారు. మరి రాజ్యాంగబద్దలైన పదవిలో ఆయన అలా మాటలు తూలడం తప్పుకాదా. అసలు కోర్టుల మీద, జడ్జీల మీద అసంతృప్తితో ఉన్నప్పుడు, ఉద్దేశ్యపూర్వకంగా, కుట్రపూరితంగా అడ్డుపడుతున్నారనే అనుమానం, అందుకు ఆధారాలు ఉన్నప్పుడు స్పీకర్ సహా వైసీపీ నేతలు అంతలా మాటలతో హద్దు మీరడం ఎందుకు, న్యాయవ్యవస్థను గౌరవించేవారే అయితే ఒక్క మాట కూడ మాట్లాడకుండా సుప్రీమ్ చీఫ్ జస్టిస్ వద్దకు వెళ్ళుండాల్సింది. కానీ వైసీపీ లీడర్లు కోర్టులను, జడ్జీలను ప్రత్యర్థులుగా పరిణగించి అనకూడావన్నీ అనేశారు. కోర్టులంటే వీరికి వద్ద శత్రువుల్లా ఉందే అనే భావన క్రియేట్ చేసుకున్నారు. జనం సైతం ఈ విషయాన్ని బాగా గమనించేశారు.