జగన్ సర్కారుకు అంత తొందరెందుకు ?

Why YS Jagan's government went to Supreme court
వైఎస్ జగన్ ప్రభుత్వం మూడు రాజధానుల విషయంలో ఎంత పట్టుదలగా ఉన్నారో తెలిసిందే.  ఆయన పట్టుదలకు మరింత ఊపునిస్తూ గవర్నర్ మూడు రాజధానుల బిల్లు మీద ఆమోద ముద్ర వేశారు.  దీంతో అమరావతి నుండి పాలనాపరమైన శాఖలను విశాఖకు తరలించాలని వైఎస్ జగన్ చక చకా పావులు కదిపారు.  ఆగష్టు 15న ముహుర్తం కూడా ఫిక్స్ చేసుకున్నారు.  కానీ ఇంతలోనే హైకోర్టులో రైతుల పిటిషన్లు విచారణకు రావడంతో ప్రభుత్వం స్టేటస్ కో విధించింది.  14 వరకు రాజధాని విషయంలో యధాతథ స్థితిని కొనసాగించాలని తెలిపింది   పిటిషన్ మీద కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వానికి తెలిపుతూ 10 రోజుల గడువు ఇచ్చింది.  
 
మామూలుగా అయితే ఇలాంటి స్టేటస్ కోల విషయంలో ప్రతివాదులు వెంటనే కౌంటర్లు దాఖలు చేసి తమ వాదనను వినిపిస్తాయి.  కానీ ఏపీ ప్రభుత్వం తొందరపాటు చూపెట్టింది.  హైకోర్టు ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులు న్యాయ సూత్రాలకు విరుద్దంగా ఉన్నాయని అంటూ సుప్రీం కోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేసింది.  సోమవారం ఈ పిటిషన్ మీద విచారణ జరిగే అవకాశం ఉంది.  అయితే ఈ పిటిషన్ విషయంలో ప్రభుత్వానికి ఎదురుదెబ్బ తగిలే అవకాశం ఉందని అంటున్నారు న్యాయ నిపుణులు.  ఎందుకంటే హైకోర్టు మూడు రాజధానుల బిల్లును తప్పుబట్టలేదు.  ప్రభుత్వ చర్యలను ఖడించలేదు.  కేవలం ప్రభుత్వానికి వ్యతిరేకంగా దాఖలైన పిటిషన్లకు సంబంధించి కౌంటర్ వాదన వినిపించమని మాత్రమే ఆదేశించింది. 
 
ఆ మేరకు ప్రభుత్వం కౌంటర్ దాఖలు చేసి ఉంటే సరిపోయేది.  కానీ జగన్ బృందం మాత్రం మూడు రాజధానుల ఏర్పాటుకు హైకోర్టు అడ్డంపడుతున్నట్టు భావించి సుప్రీం కోర్టును ఆశ్రయించింది.  అయితే సుప్రీం కోర్టు ముందుగా హైకోర్టు ఆదేశాల మేరకు కౌంటర్ దాఖలు చేయమని ప్రభుత్వాన్ని వెనక్కు పంపే అవకాశం ఉందట.  ఇప్పటికే పలుమార్లు హైకోర్టు తీర్పులను సవాల్ చేస్తూ సుప్రీం కోర్టుకు వెళ్లిన ప్రభుత్వానికి వ్యతిరేకంగానే తీర్పులు వచ్చిన దరిమిలా ఈ స్పెషల్ లీవ్ పిటిషన్ మీద కూడా వ్యతిరేక ఉత్తర్వులే వస్తే అనవసరంగా కోరి మరీ పరాభవాన్ని ఆహ్వానించినట్టే అవుతుంది.  మరి న్యాయ సలహాల బృందం ఈ చిన్న లాజిక్ వదిలేసి సుప్రీం కోర్టు మెట్లు ఎక్కమని ప్రభుత్వానికి ఎలా సలహా ఇచ్చిందో.