2019 ఎన్నికల తరువాత ఏపీలో వైసీపీ యొక్క ఆదరణను అంచనా వెయ్యడం ఎవ్వరి వల్ల కాదు. ఈ ఎన్నికల్లో వైసీపీ గెలిచిన తరువాత ఇతర పార్టీల్లో ఉన్న నాయకులు కూడా చాలామంది వైసీపీలోకి రావడానికి ప్రయత్నాలు చేశారు, చేస్తున్నారు. ఇప్పటికే టీడీపీ నుండి గెలిచిన నాయకులు కూడా ఇప్పుడు వైసీపీ పక్షాన నిలబడ్డారు. అలాగే టీడీపీ తరపున ఓడిన నాయకులు కూడా వైసీపీ బాట పట్టారు. అయితే వెళ్లి, వైసీపీలో ఎలాంటి గుర్తింపు లేకుండా ఉన్న ఈ ఇద్దరు కాపు నాయకులను చుస్తే మాత్రం జాలేస్తుంది.
ఎవరా నాయకులు??
టీడీపీ నుండి వైసీపీకి వచ్చి, ప్రాధాన్యత లేకుండా ఉన్న ఆ నాయకులు ఎవరంటే తూర్పు గోదావరి జిల్లాలో బలమైన కాపు సామాజిక వర్గానికి చెందిన వారే. వారే మాజీ ఎమ్మెల్యే, ప్రస్తుత అమలాపురం పార్లమెంటరీ పార్టీ అధ్యక్షుడు తోట త్రిమూర్తులు, మరో నేత మాజీ మంత్రి, మాజీ ఎంపీ తోట నరసింహం, ఆయన భార్య తోట వాణి. వీరిలో ఒక నేతను వైసీపీ అధిష్టానమే వ్యూహాత్మకంగా సైడ్ చేసేస్తే మరో నేతను చాలా సైలెంట్‌గా వ్యూహాత్మకంగా నియంత్రిస్తోంది. ఈ ఇద్దరు నేతలు కూడా ఒకప్పుడు తెలుగు రాజకీయాల్లో తమకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు కలిగిన నాయకులు. అలాంటి నాయకులు ఇప్పుడు ఇలా ఎలాంటి ప్రాధాన్యత లేకుండా ఉండటాన్ని చూస్తూనే జాలేస్తుంది.
నిరాశే మిగిలింది
టీడీపీ నుండి వైసీపీలోకి వస్తే ఎదో మంచి జరుగుతుందని భావించిన నేతలకు వైసీపీ మొండి చెయ్యి చూపించింది. తోట తనకు ఎమ్మెల్సీ వస్తుందని ఆశలు పెట్టుకున్నా ఆయన ఆశలు నెరవేరే ఛాన్సే లేదు. త్రిమూర్తులకు మండపేటలో ఏ మాత్రం పట్టులేదు. దీంతో మండపేట ఇన్‌చార్జ్‌గా ఉంటూ రామచంద్రాపురంలో తన వర్గాన్ని కాపాడుకోవడం ఆయనకు తలకు మించిన భారంగా మారింది. వచ్చే ఎన్నికలకు అయినా ఈ నాయకులకు వైసీపీలో ఎలాంటి ప్రాధాన్యత ఉంటుందో వేచి చూడాలి.