వరదలతో నష్టపోయిన హైదరాబాద్ నగరాన్ని ఆదుకోవడానికి అనేకమంది ముందుకొస్తున్నారు. పక్క రాష్ట్రాల ప్రభుత్వాలు, సినీ సెలబ్రిటీలు, ప్రైవేట్ పారిశ్రామికవేత్తలు భారీ మొత్తంలో విరాళాలు ఇస్తున్నారు. ఇప్పటికే పెద్ద మొత్తంలో ముఖ్యమంత్రి సహాయనిధికి చేరిన విరాళాలు చేరగా అవి ఇంకా కొనసాగే అవకాశం ఉంది. ఇలా తెలంగాణకు పెద్ద మొత్తంలో విరాళాలు వచ్చి పడుతుంటే ఏపీకి మాత్రం ఒక్క రూపాయి కూడ రావట్లేదు. ఎవ్వరూ కూడ ఏపీలో మునిగిపోయిన ప్రాంతాల గురించి చర్చించుకోవట్లేదు. అక్కడి రైతులకు సహాయం చేయాలనే ఆలోచన ఎవ్వరికీ రాలేదు. ఇందుకు కారణం ఏమిటయ్యా అంటే సీఎం జగనే అంటున్నారు.
అవును.. హైదరాబాద్ మునిగిపోతే కేసీఆర్ తమకు సహాయం చేయమని బహిరంగంగా అందరికి విజ్ఞప్తి చేశారు. అలా అడగడంలో ఎలాంటి నామోషీ ఫీల్ కాలేదు ఆయన. ప్రెస్ మీట్ పెట్టి విరాళాలకు పిలుపునిచ్చారు. ఒక రాష్ట్ర సీఎం సహాయం అడిగితే ఎవరు కాదంటారు. అందుకే పక్క రాష్ట్రాల ప్రభుత్వాలతోఇ సహా ప్రముఖులు కదలివచ్చి పోటీపడి సహాయం చేస్తున్నారు. ఇలా సహాయం పొందడంలో తప్పేమీ లేదు. కష్టం వచ్చినపుడు సహాయం కోరడం చిన్నతనమూ కాదు. ఇంకా రాష్ట్రం కోసం తపనపడుతున్న వ్యక్తి అనే పేరు కూడ వస్తుంది. కానీ ఏపీ సీఎం జగన్ మాత్రం అలా చేయలేదు.
హైదరాబాద్ స్థాయిలో కాకపోయినా ఏపీలో కూడ వారంపాటు ఎడతెరిపి లేకుండా కురిసిన వానలకు ఉభయ గోదావరి జిల్లాలు, కృష్ణ, గుంటూరు జిల్లాల్లో రైతులు భారీగానే నష్టపోయారు. చేతికొచ్చిన పంట నీళ్లపాలైపోయింది. పైనుండి వచ్చిన భారీ వరదకు గోదావరి, కృష్ణ నదులు పొంగడంతో కొన్ని గ్రామాలు నీటమునిగాయి. ఆస్తి నష్టం కూడ గట్టిగానే ఉంటుంది. రైతులు, ముంపు బాధితులు సహాయం కోసం ఎదురుచూస్తున్నారు. కాబట్టి సీఎం జగన్ ఒక్క కేంద్రం నుండి వచ్చే నిధుల మీదే ఆధారపడకుండా బయటి నుండి కూడ నిధులను సేకరిస్తే బాధితులకు మరింత ఎక్కువగా సహాయం చేయవచ్చు. పైపెచ్చు అసలే అప్పుల భారంతో ఉన్న రాష్ట్ర ఖజానాకు బయటి నుండి వచ్చే సహాయం కొంత ఉపశమనంగా ఉంటుంది.
కానీ జగన్ ఎవ్వరినీ సహాయం అడగలేదు. తోచిన సహాయమేదో ప్రభుత్వమే చేస్తోంది. ఇది చూసిన జనం అవతల హీరోలు కోట్లకు కోట్లు తెలంగాణకు ఇస్తున్నారు. మనకు ఎందుకు ఇవ్వట్లేదు. ఎక్కువమంది ఆంధ్రా ప్రాంతం వాళ్ళే కదా. అసలు మన ముఖ్యమంత్రి సహాయం కోసం అడిగితే కదా. ధనిక రాష్ట్రమని చెప్పుకునే తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ నోరు తెరిచి సహాయం అడగ్గా లేనిది అప్పుల్లో ఉన్న మనం ఎందుకు అడగకూడదు. అయినా అడగకుండా ఎవరైనా సహాయం చేస్తారా అంటున్నారు బాధితులు.