‘పేరు’ మీద వైఎస్ జగన్‌కి ఎందుకింత ‘తాత్కాలిక’ ప్రేమ.?

స్వర్గీయ నందమూరి తారకరామారావు పేరుని కొత్తగా జిల్లాల విభజన జరిగాక, ఓ జిల్లాకి పెట్టిన మాట వాస్తవం. ‘స్వర్గీయ ఎన్టీయార్ మీద మాకున్న గౌరవం అది..’ అని వైఎస్ జగన్ గతంలోనూ చెప్పుకున్నారు, ఇప్పుడూ తాజాగా సెలవిచ్చారు. కానీ, ఎన్టీయార్ హెల్త్ యూనివర్సిటీ పేరులోంచి ఎన్టీయార్‌ని తీసేసి, తన తండ్రి వైఎస్సార్ పేరుని పెట్టుకున్నారు వైఎస్ జగన్.

అసలెందుకిదంతా.? ప్రభుత్వం మారగానే, మళ్ళీ ఆ యూనివర్సిటీ పేరు మార్చేసుకోవచ్చన్నమాట. జిల్లాల పేర్లు అయినా అంతే కదా.? ప్రతిదాన్నీ ‘తాత్కాలికం’ ఎందుకు చేస్తున్నట్లు.? ఇది ఒకింత లోతుగా ఆలోచించాల్సిన విషయమే.

చంద్రబాబు హయాంలో అమరావతి అనేది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రాజధాని అయితే, వైఎస్ జగన్ హయాంలో మూడు రాజధానులంటూ హంగామా చేస్తున్నారు. ఇలా రాజధానిని తాత్కాలికం చేసెయ్యడంతో.. ముందు ముందు ప్రభుత్వాలు రాజధానిపై ఎలాగైనా వ్యవహరించొచ్చన్నమాట.

సంక్షేమ పథకాలకు నాయకుల పేర్లను పెట్టుకోవడం ఓ జాడ్యంగా తయారైందన్నది ఓపెన్ సీక్రెట్. మహనీయుల పేర్లు పెడితే ఒక లెక్క.. తమ కుటుంబ సభ్యుల పేర్లను పెట్టుకుంటే ఇంకో లెక్క. రేప్పొద్దున్న పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి అయితే, తన అన్న మాజీ కేంద్ర మంత్రి గనుక.. చిరంజీవి పేరుని ఓ జిల్లాకి పెట్టేయాలేమో.!

ఎన్టీయార్ హెల్త్ యూనివర్సిటీ పేరు ఎందుకు మార్చాల్సి వచ్చింది.? ప్రాజెక్టులకు సైతం నాయకుల పేర్లు ఎందుకు పెడుతున్నారు.? గతంలో పేర్లు పెడితే అవి మారేవి కావు. కానీ, ఇప్పుడలా కాదు. ఐదేళ్ళకోసారి పేర్లు మారిపోతుంటాయ్.. రాజధానులూ మారిపోతుంటాయ్.

తప్పుడు సంకేతాల్ని ప్రజాస్వామ్యంలోకి పంపుతున్నారు వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి. ‘నేనే ముఖ్యమంత్రినైతే.. నా పేరు రాష్ట్రానికి పెట్టేసుకుంటా..’ అనే స్థాయికి ఎవరైనా భావించే పరిస్థితులు వచ్చినా రావొచ్చు.