అడ్డగోలు విమర్శలు చేయడమెందుకు.? పార్టీ నుంచి రఘురామకృష్ణరాజుని సస్పెండ్ చేసి పారెయ్యొచ్చు కదా.?

వైసీపీలో చాలామంది వ్యక్తం చేస్తున్న అభిప్రాయమిది. కానీ, ఎవరూ బాహాటంగా చెప్పలేకపోతున్నారు. ఎమ్మెల్సీ అనంతబాబుని పార్టీ నుంచి సస్పెండ్ చేసినప్పుడు, రఘురామకృష్ణరాజుని కూడా సస్పెండ్ చేసెయ్యొచ్చు. కానీ, చెయ్యలేకపోవడమంటే, అది అధినేత అసమర్థతగానే భావించాల్సి వుంటుందంటూ వైసీపీలోనే అంతర్గతంగా చర్చ జరుగుతోంది.

వైసీపీ ఎంపీ (రాజ్యసభ) విజయసాయిరెడ్డి, సోషల్ మీడియా వేదికగా, రఘురామపై అడ్డగోలు విమర్శలు చేస్తున్నారు. అంతకన్నా దారుణంగా రఘురామ కౌంటర్ ఎటాక్ ఇస్తున్నారు. వైసీపీ అధినేత తెలుసుకోవాల్సిందేంటంటే, విజయసాయిరెడ్డి అలాగే రఘురామ.. ఓ పద్ధతి ప్రకారం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని భ్రష్టు పట్టించేస్తున్నారని.

వైఎస్ జగన్ అనుమతి లేకుండా విజయసాయిరెడ్డి, రఘురామకృష్ణరాజు మీదనో, చంద్రబాబు మీదనో, ఇంకొకరి మీదనో విమర్శలు చేస్తారని అనుకోలేం. ఆ కోణంలో చూస్తే, ఈ సిల్లీ పొలిటికల్ గేమ్ అంతా వైఎస్ జగన్ కనుసన్నల్లోనే జరుగుతోందని అనుకోవాలి.?

కానీ, ఎన్నాళ్ళిలా.? క్యాడర్‌కి తప్పుడు సంకేతాలు వెళుతున్నాయి. అధినేత మెప్పు కోసం నాయకులు చేసే ఈ తరహా చీప్ ట్రిక్స్, పార్టీ కొంప ముంచేస్తాయన్నది నిర్వివాదాంశం. ఆయా నాయకుల సోషల్ మీడియా హ్యాండిల్స్ ఫాలో అవ్వాలంటేనే క్యాడర్‌కి జుగుప్స కలుగుతోందిప్పడు. అలాంటిది, పార్టీకి మద్దతుగా ఎలా నిలబడతారు.?

వున్నపళంగా ఈ వ్యవహారాలపై ఆత్మ పరిశీలన చేసుకోవాల్సింది అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మాత్రమే. లేదంటే, సామాన్య ప్రజానీకం వైసీపీని చీదరించుకునే పరిస్థితి రావొచ్చు.