ఏపీలో రోడ్ల దుస్థితిపై వైసీపీ సర్కారుకెందుకంత నిర్లక్ష్యం.?

విపక్షాలు ప్రశ్నిస్తాయ్.. ప్రశ్నించాలి కూడా. రాష్ట్రంలో రోడ్ల దుస్థితి గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. కానీ, వైఎస్ జగన్ సర్కార్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రోడ్ల దుస్థితిపై శ్రద్ధ పెట్టడంలేదు. అత్యంత దారుణంగా తయారైన రోడ్ల మీద నిత్యం ఎన్నో ప్రమాదాలు జరుగుతున్నాయి. ‘అసలు మనిషన్నవాడు ఇలాంటి రోడ్ల మీద ఎలా ప్రయాణిస్తాడు.?’ అన్న ప్రశ్న చాలా రోడ్ల విషయమై తలెత్తుతోంది. బస్సులు గోతుల్లో దిగబడిపోతున్నాయ్.. ఆటోలు తిరగబడిపోతున్నాయ్.. టూ వీలర్లు అయితే.. ఏకంగా రోడ్ల మీద గుంతల్లో నీరు పేరుకుపోవడంతో వాటిల్లో మునిగిపోతున్నాయ్. విపక్షాలు రాజకీయంగా చేసే విమర్శలు కావివి. ఆంధ్రప్రదేశ్ రోడ్ల మీద కనిపిస్తున్న వాస్తవ పరిస్థితులు. అయినాగానీ, ప్రభుత్వ పెద్దలకు రోడ్ల దుస్థితికి బలైపోతున్న ప్రజల మీద కనీసపాటి జాలి, దయ, కనికరం లేకుండా పోయాయి. వందల కోట్ల రూపాయలు, వేల కోట్ల రూపాయల్ని రోడ్ల కోసం కేటాయిస్తున్నట్లు గతంలోనే వైఎస్ జగన్ ప్రభుత్వం సెలవిచ్చింది.

గత వేసవి కాలం ఈ రోడ్ల విషయమై జగన్ సర్కార్ ఎందుకు శ్రద్ధ పెట్టలేకపోయింది.? వేసవి కాలం తర్వాత వచ్చే వర్షా కాలంలో రోడ్లు మరీ దారుణంగా తయారవుతాయని పాలకులకు తెలియదా.? ఇప్పుడేమో వర్షాకాలం.. రోడ్లను బాగు చేయాలని సంకల్పిస్తే.. అది వృధా ప్రయాసే అవుతుంది. అలాగని, రోడ్లను బాగు చేయకుండా వదిలేస్తే.. చాలా ప్రాణాలు గాల్లో కలిసిపోతాయి. రోడ్ల దుస్థితిపై ముఖ్యమంత్రి సమీక్ష జరిపారు.. అక్టోబర్ నాటికి వర్షాలు తగ్గుముఖం పడతాయి కాబట్టి, ఆ వెంటనే రోడ్లు బాగు చేయాలని అధికారులకు ముఖ్యమంత్రి సూచించారట. కానీ, ముఖ్యమంత్రి ఆదేశాలు అమలవుతాయా.? అసలు ముఖ్యమంత్రి చిత్తశుద్ధితోనే ఆదేశాలు ఇస్తున్నారా.? అన్న అనుమానం కలుగుతోంది. ఎందుకంటే, గతంలో ముఖ్యమంత్రి ఇచ్చిన ఆదేశాల్ని అధికారులు అమలు చేయలేదు మరి. ఒక్కటి మాత్రం నిజం.. వానా కాలం కబుర్లతో కాలక్షేపం చేస్తే.. ఈ రోడ్లే, వైసీపీని రాజకీయంగా ముంచేస్తాయ్.