హైదరాబాద్‌కు విజయసాయి.. ఆంధ్రా వైద్యం మీద నమ్మకం లేకనేనా ?

వైసీపీ కీలక నేత, రాజ్యసభ ఎంపీ విజయసాయిరెడ్డిగారికి కరోనా పాజిటివ్ అని తేలింది.  ఇది విచారించదగిన సంగతే.  కానీ విజయసాయిరెడ్డిగారి గత వ్యాఖ్యల దృష్ట్యా ఆయన మీద విమర్శల వర్షం కురుస్తోంది.  దొరికిందే తడవని టీడీపీ వర్గాలు ఆయన మీద వ్యంగ్యాస్త్రాలు సంధిస్తుంటే ఇంకొందరు మాత్రం పరోక్షంగా ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు.  ఇందుకు కారణం పాజిటివ్ రిపోర్ట్స్ రాగానే విజయసాయిగారు హుటాహుటిన హైదరాబాద్ వెళ్లి ప్రముఖ ప్రైవేట్ ఆసుపత్రిలో జాయిన్ అయిపోయారు.  ఇదే ప్రభుత్వ ఆసుపత్రుల పనితీరు మీద ప్రజలకు అనుమానాలు మొదలయ్యేలా చేసింది.  
 
వైఎస్ జగన్ ప్రభుత్వం ఏర్పడ్డాక ప్రభుత్వ ఆసుపత్రులను అద్భుతంగా మెరుగుపరిచారని, ప్రైవేట్ వైద్యశాలలకు ధీటుగా వాటిలో వైద్యం అందుతుందని ప్రభుత్వ పెద్దలు ఊదరగొట్టారు.  అసలు విజయసాయిరెడ్డిగారైతే ప్రభుత్వ హాస్పిటళ్ల రూపు రేఖలు సమూలంగా మారిపోయాయని అనేకమార్లు వ్యాఖ్యానించారు.  అసలు కోవిడ్ మీద యుద్దంలో ఏపీ వైద్య వ్యవస్థను అన్ని విధాలా సన్నద్దం చేశారని చెప్పేవారు.  అనంతపురంలో 1500 పడకల కోవిడ్ ఆసుపత్రిని యుద్ద ప్రాతిపదికన నిర్మించారని అంతేగాక కొత్త మెడికల్ కాలేజీలు, హాస్పిటళ్లు.  10 రెట్లు పెరిగిన ఐసియూ బెడ్లు, వెంటిలేటర్లు.  కొత్తగా 108 అంబులెన్సులు, పబ్లిక్ హెల్త్ కేర్ రంగం సాచ్యురేషన్ స్థాయికి దూసుకెళ్తోంది. ఆరోగ్యశ్రీలో కరోనాను కూడా చేర్చారు సిఎంగారు. విద్య, ఆరోగ్యం ఆయన ప్రాథమ్యాలలో ముందున్నాయి అంటూ గొప్పగా మాట్లాడారు.  
 
30 బెడ్లు అందుబాటులో ఉండగా, ఇంకో రెండు నెలల్లో మరో 40 వేల పడకలు అందుబాటులోకి వస్తాయని, 203 కోట్లతో అంబులెన్సులు కొన్నారని అంటూ భారీ ఎలివేషన్లు ఇచ్చారు.  ఇక అచ్చెన్నాయుడు విషయంలో అయితే ఆరోగ్యంగా గుండ్రాయిలా ఉన్నా ఈ డ్రామాలేంటి అచ్చన్నా? కార్పొరేట్ ఆస్పత్రే కావాలా ? ఏం ఈఎస్ఐ ఆస్పత్రి వద్దా? మీ CBN హయాంలా కాదు జగన్ గారి ప్రభుత్వం.  ఆస్పత్రులకు అన్ని హంగులు అద్దింది. సమస్య వస్తే చూసుకుంటుంది అంటూ వెటకారంగా మాట్లాడారు.  ఇంతలా మాటలు చెప్పిన ఆయన తనకు కోవిడ్ అని తెలీగానే ఆఘమేఘాల మీద హైదరాబాద్ వెళ్లిపోయారు.  ఒకవేళ నిజంగానే ఆయన చెప్పినట్టు ఏపీలో ప్రభుత్వ వైద్యం అంత గొప్పగా ఉంటే హైదరాబాద్ వెళ్లాల్సిన ఆవసరం ఏముంది.  ఇక్కడే ఉండి ఏదో ఒక ప్రభుత్వ వైద్యశాలలో చికిత్స తీసుకోవచ్చు కదా.  కానీ పక్క రాష్ట్రం పరిగెత్తారు.  అంటే వారు మెరుగుపరిచిన ప్రభుత్వ వైద్యశాలల మీద వారికే నమ్మకం లేకపోతే ఇక ప్రజలు ఎలా నమ్ముతారు.  మెజారిటీ జనం ఈ ప్రశ్నలనే లెవనెత్తుతున్నారు.