ముఖ్యమంత్రిగా వున్నప్పుడు నారా చంద్రబాబునాయుడు ఎలా ఢిల్లీకి వెళ్ళారో.. వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కూడా ముఖ్యమంత్రి హోదాలో అలాగే ఢిల్లీకి వెళుతున్నారు. అంతకు మించి ఏదో తేడా వుందని ఎలా అనుకోగలం.? ఢిల్లీలో చీకటి రాజకీయాలు నడుస్తాయన్న చర్చ గతంలోనూ జరిగింది, ఇప్పుడూ జరిగింది.
రాజకీయాలు ఇలానే తగలడ్డాయ్ గనుక.. ఆ రాజకీయ కోణంలోనే ప్రతి విషయాన్నీ అనుమానిస్తూ పోతే ఎలా.? ఓ రాష్ట్ర ముఖ్యమంత్రి, దేశ రాజధాని ఢిల్లీకి వెళ్ళి కేంద్ర ప్రభుత్వ పెద్దలను కలవడమంటే, రాష్ట్రానికి సంబంధించిన అంశాలపైనే ఆ పర్యటన వుంటుందనే పాజిటివ్ యాంగిల్, విపక్షాలకు ఎప్పుడు కనిపిస్తుంది.? అసలు కనిపిస్తుందా.? లేదా.? చంద్రబాబు హయాంలో వైసీపీ విమర్శలు చేసింది కాబట్టి, వైసీపీ హయాంలో టీడీపీ విమర్శిస్తోందంతే.. ఇంతకు మించిన లాజిక్ ఇంకోటి కనిపించడంలేదు.
వాస్తవానికి, ఆంధ్రపదేశ్ రాజకీయాలు దేశానికే ఆదర్శంగా నిలిచేందుకు ఓ అద్భుతమైన అవకాశం దక్కింది విభజన కారణంగా. అన్ని రాజకీయ పార్టీలూ ఒక్కతాటిపైకొచ్చి, విభజన హామీల విషయమై కేంద్రం మీద ఒత్తిడి తీసుకు వచ్చి వుంటే.. ఎంత బావుండేది.? విభజన ద్వారా రాష్ట్రానికి అయిన గాయం అలాంటిలాంటిది కాదు. ఎన్నేళ్ళయినా మానని గాయం అది. ఆ గాయం తాలూకు నొప్పిని ప్రతిరోజూ రాష్ట్ర ప్రజలు అనుభవించాల్సి వస్తోంది. ఇప్పటిదాకా రాష్ట్రానికి సరైన రాజధాని లేదంటే, అది ఎవరి వైఫల్యం.? అన్న విషయమై అన్ని రాజకీయ పార్టీలూ ఆత్మ విమర్శ చేసుకోవాలి.
తాను ప్రధానిగా పనిచేస్తున్న ఓ దేశంలో.. ఓ రాష్ట్రానికి రాజధాని లేదంటే, అది నరేంద్ర మోడీకి కూడా అవమానమే. ఇక, ముఖ్యమంత్రులుగా పరిపాలించిన, పరిపాలిస్తున్న చంద్రబాబు, వైఎస్ జగన్ సంగతి సరే సరి. రాజకీయాల్ని పక్కన పెట్టి, ముఖ్యమంత్రి ఢిల్లీ పర్యటనలో పలు అంశాలకు కేంద్రం నుంచి పరిష్కారం రావాలని ఆశిస్తే, ఆ దిశగా అధికార పార్టీకి విపక్షాలు అండగా నిలిస్తే.. కాస్తో కూస్తో రాష్ట్రానికి లాభం వుంటుంది.
అధికార వైసీపీ సైతం, ఢిల్లీకి చేస్తున్న అధికార పర్యటనల సమయంలో విపక్షాల నుంచి సూచనలు, సలహాలు తీసుకోవడం మంచిది. కానీ, అలాంటి మంచి రాజకీయాల్ని ఆంధ్రపదేశ్ రాష్ట్రం నుంచి ఆశించలేం.