ఈటెలపై అలా.. ఆసుపత్రుల దోపిడీపై ఎందుకిలా.?

Why Serious Action On Etela, Why Not On Private Hospitals?
Why Serious Action On Etela, Why Not On Private Hospitals?
 
నీడ్ ఆఫ్ ధి అవర్.. అంటే ముమ్మాటికీ ఇదే. ప్రైవేటు ఆసుపత్రుల్లో బిల్లు వాచిపోతోంది కరోనా బాధితులకి. లక్షల్లో దోచేస్తున్నాయి ప్రైవేటు ఆసుపత్రులు. ప్రైవేటు ఆసుపత్రుల దోపిడీపై ప్రభుత్వానికి ఖచ్చితమైన సమాచారం వుంది. అందుకే, ప్రైవేటు ఆసుపత్రులకు వెళ్ళొద్దు.. ప్రభుత్వాసుపత్రుల్లో అన్ని సౌకర్యాలూ వున్నాయని సాక్షాత్తూ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు చెబుతున్నారు.
 
నిజానికి, కేసీఆర్ మాటల్లో కొంత మేర వాస్తవం వుంది. ప్రస్తుత పరిస్థితుల్లో ప్రభుత్వాసుపత్రులే మెరుగైన రీతిలో కోవిడ్ రోగులకు వైద్య చికిత్స అందిస్తున్నాయి ప్రైవేటు ఆసుపత్రులతో పోల్చితే. ప్రైవేటు ఆసుపత్రులకు వెళ్ళే కరోనా బాధితుల ప్రాణాలకు గ్యారంటీ వుండడంలేదు.. ఇంకోపక్క, ఆర్థిక విధ్వంసం కూడా జరుగుతోంది. ప్రైవేటుకి వెళ్ళొద్దు.. అని ప్రభుత్వం సూచిస్తే సరిపోదు.. అభ్యర్థిస్తే అస్సలు సరిపోదు. డబ్బులున్నోళ్ళు ప్రైవేటు ఆసుపత్రులకు వెళతారు.. డబ్బుల్లేనోళ్ళు కూడా మెరుగైన వైద్యం అందుతున్న నమ్మకంతో ప్రైవేటు ఆసుపత్రులకు వెళ్ళడాన్ని తప్పు పట్టలేం. అక్కడ మంచి వైద్యం అందకపోతే, ఆయా ఆసుపత్రులపై చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే.
 
ప్రభుత్వం నిర్దేశించిన ధరలకంటే ఎక్కువ వసూళు చేస్తున్న ప్రైవేటు ఆసుపత్రులపై ప్రభుత్వం కొరడా ఝుళిపించాల్సిందే. తన మంత్రి వర్గంలో పనిచేసిన ఈటెల రాజేందర్ మీద ఆరోపణలు రాగానే, ముఖ్యమంత్రి కేసీఆర్ రికార్డు సమయంలో విచారణ జరిపించి చర్యలు తీసుకున్నారు. ఇప్పుడు ఈటెల తనయుడి మీద కూడా అదే తరహా చర్యలకు రంగం సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. ఈటెల వ్యవహారంపై చర్యలు కాస్త లేటయినా నష్టం లేదు. కానీ, ఇక్కడ ప్రైవేటు ఆసుపత్రుల దోపిడీ కారణంగా ప్రాణాలు పోతున్నాయ్.. ఆర్థిక విధ్వంసం జరుగుతోంది.. ముఖ్యమంత్రి కేసీఆర్, ఈ దోపిడీపై ఎందుకు చర్యలు తీసుకోవడంలేదు.? ఇదే ఇప్పుడు మిలియన్ డాలర్ల ప్రశ్న.