ప్రభాస్ ఇప్పుడు పాన్ ఇండియా హీరో. ఒక్కొక సినిమాకు 100 కోట్ల పారితోషకం పుచ్చుకుంటున్నారు. భవిష్యత్తులో అది ఇంకా పెరగవచ్చు కూడ. ఆయనతో సినిమా చేయడానికి ఒక మాదిరి నిర్మాతలు సరిపోరు. కనీసం 200 కోట్ల బడ్జెట్ పెట్టాలి. మన తెలుగులో చూస్తే అలాంటి నిర్మాతలు ముగ్గురో నలుగురో ఉన్నారు తప్ప ఎక్కువమంది లేరు. వారిలో కూడ ఒకరిద్దరు తప్ప మిగతవారు సాహసం చేస్తారో లేదో తెలీదు. అందుకే ప్రభాస్ దృష్టి బాలీవుడ్ మీదనే ఉంది. ఆయన మీద వందల కోట్లు కుమ్మరించడానికి బాలీవుడ్ బడా నిర్మాణ సంస్థలు సిద్ధంగా ఉన్నాయి. అందుకే ప్రభాస్ డేట్స్ అన్నీ హిందీ నిర్మాతల వద్దనే ఉన్నాయి.
ప్రజెంట్ ప్రభాస్ ‘రాధేశ్యామ్’ కాకుండా తెలుగులో నాగ్ అశ్విన్ సినిమా ఒక్కటే చేస్తున్నారు. మిగతావన్నీ ఇతర భాషల దర్శకులే చేస్తున్నారు. ‘ఆదిపురుష్’కు హిందీ డైరెక్టర్ ఓం రౌత్ దర్శకత్వం చేస్తున్నారు. ‘సలార్’కు కన్నడ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ సారథ్యం వహిస్తున్నారు. ఇక త్వరకో ప్రభాస్ 24వ సినిమాను అనౌన్స్ చేయనున్నారు. దానికి కూడ హిందీ దర్శకుడు సిద్దార్థ్ ఆనంద్ దర్శకత్వం అంటున్నారు. దీన్ని తెలుగు నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించనున్నారు. మరి తెలుగు నిర్మాతలు, తెలుగు హీరో అయినప్పుడు దర్శకుడు కూడ తెలుగువాడే అయ్యుంటే బాగుండేది కదా. తెలుగు దర్శకుడే అవ్వాలనే రూల్ లేకపోయినా తెలుగు దర్శకుల్లో ఎవరికైనా అవకాశం ఇవ్వొచ్చు కదా అనేది ప్రేక్షకుల్లో మెదులుతున్న ప్రశ్న. మరి ప్రభాస్ కు తెలుగు దర్శకులు ఎవ్వరూ అనలేదేమో.