చిరంజీవి మంచితనం.. ఇక్కడెందుకు చర్చనీయాంశం.?

మెగాస్టార్ చిరంజీవి ఎంత మంచివాడో తెలుసా.? అంటూ సినీ నటుడు, వైసీపీ కార్యకర్త పోసాని కృష్ణమురళి పెద్ద పాఠమే చదివారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో పోసాని కృష్ణమురళికి సభ్యత్వం లేదు. ఆయన కేవలం జగన్ మోహన్ రెడ్డిని అభిమానిస్తారంతే. కానీ, ఎందుకో రెండు మూడు రోజులుగా తాను వైసీపీ కార్యకర్తనని చెప్పుకుంటున్నారు. సరే, అది ఆయనిష్టం. మెగాస్టార్ చిరంజీవి మంచితనం ఎందుకు పోసానికి ఇప్పుడు గుర్తుకొస్తుంది. ప్రజారాజ్యం పార్టీ సమయంలో, చిరంజీవిపైనా, చిరంజీవి కుటుంబంపైనా కొందరు రాజకీయ విమర్శలు చేస్తే.. ఆ సమయంలో చిరంజీవి ఎంతో బాధపడ్డారనీ, ఆ బాధ చూడలేక తాను ఆయన తరఫున వకాల్తా పుచ్చుకున్నాననీ పోసాని చెబుతున్నారు. ‘అప్పుడు నువ్వేమైపోయావ్.?’ అని పవన్ కళ్యాణ్‌ని పోసాని ప్రశ్నిస్తున్నారు. ఆ సమయంలో పవన్ కళ్యాణ్, ప్రజారాజ్యం పార్టీ యూత్ వింగ్ ప్రెసిడెంట్. ప్రజారాజ్యం పార్టీ యువ విభాగం యువ రాజ్యం తరఫున పవన్ కళ్యాణ్, అప్పట్లో చిరంజీవిపై వచ్చే విమర్శల్ని ఖండించారు.. రాజకీయ ప్రత్యర్థులపై నిప్పులు చెరిగారు.

పైగా, అన్నయ్య మీద అమితమైన అభిమానం గనుక, చిరంజీవి మీద ఎవరన్నా విమర్శలు చేస్తే పవన్ ఊరుకుంటారని ఎలా అనుకోగలం.? చిరంజీవి మంచితనం గురించి ఇంతలా చెబుతున్న పోసాని కృష్ణమురళి, చిరంజీవి వెంటే రాజకీయంగా ఎందుకు నడవలేకపోయారు.? అన్నదిక్కడ ప్రశ్న. చిరంజీవిపై సినీ రంగంలో అడపా దడపా విమర్శలొస్తుంటాయ్.. అడ్డగోలు విమర్శలే అవి. ఏనాడైనా పోసాని, చిరంజీవిపై వచ్చే విమర్శలకు కౌంటర్ ఎటాక్ ఇచ్చారా.? చిరంజీవి కుటుంబం నుంచి పవన్ కళ్యాణ్‌ని వేరు చేయాలన్నది పోసాని ఆలోచన. ఇది సుస్పష్టం. పోసాని ఎంతలా రంకెలేసినా, మెగా కుటుంబానికి పవన్ దూరమవుతారని ఎలా అనుకోగలం.? సమయమొచ్చినప్పుడు, స్పందించాల్సి వచ్చినప్పుడు మెగా కాంపౌండ్ ఎలాగూ స్పందిస్తుంది. ఈలోగా పోసాని తన పైత్యాన్ని చూపించడం మాత్రం ఆపకపోవచ్చు. ఎందుకంటే ఆయను కుదిరిన అసైన్మెంట్ అలాంటిది మరి. అప్పటిదాకా ఆయన పైత్యపు నటన మీడియా ముందు కొనసాగుతూనే వుంటుంది.