ఉత్తరాంధ్రని రెచ్చగొట్టడానికా.? గోదావరిని వదిలేశారేం.!

అమరావతి కోసం భూములిచ్చిన రైతులు మమా పాదయాత్ర చేపట్టారు.. అమరావతి నుంచి అసరవెల్లి వరకు ఈ పాదయాత్ర జరుగుతుంది. సరే, ఈ పాదయాత్ర వెనకాల టీడీపీ కుట్ర వుందా.? అన్నది వేరే చర్చ. వైసీపీ తప్ప, అన్ని రాజకీయ పార్టీలూ ఈ మహా పాదయాత్రకు మద్దతిస్తున్నాయంటే, అధికార వైసీపీలో ఆత్మవిమర్శ జరగాలి.

గుడ్డిగా అమరావతిని వ్యతిరేకించడం తప్ప, వైసీపీకి అమరావతిపై ఓ విధానమంటూ లేకుండా పోయింది. వైసీపీ చెబుతున్న మూడు రాజధానుల్లో అమరావతి కూడా వుంది. అలాంటప్పుడు, అమరావతిని ఎందుకు అంతలా వైసీపీ చీదరించుకుంటోందన్నది ఆ పార్టీ నేతలకే అర్థం కాని విషయం. అధినాయకత్వం మెప్పు కోసం మంత్రులు సైతం అత్యంత దిగజారుడు వ్యాఖ్యలు చేస్తున్నారు అమరావతి మీద.

ఉత్తరాంధ్రకు చెందిన నేతలైతే, తమ ప్రాంతం మీద జరుగుతోన్న దండయాత్రగా అమరావతి రైతుల పాదయాత్రను అభివర్ణిస్తూ తమ స్థాయిని దిగజార్చుకుంటున్నారు.

అధికారం వైసీపీ చేతుల్లో వుంది.. ఎవరన్నా వైసీపీని విమర్శిస్తే చాలు, అరెస్టు చేసి లోపలేసేస్తున్న పరిస్థితుల్ని చూస్తున్నాం. అలాంటిది, ఉత్తరాంధ్ర మీద అమరావతి రైతులు దండయాత్ర చేయగలరా.? అస్సలేమాత్రం ఇంగితం లేకుండా వైసీపీ ఎలా ఇలా మాట్లాడగలుగుతోంది.?

ఉత్తరాంధ్ర సంగతి తర్వాత.. ముందైతే అమరావతి నుంచి అరసవెల్లి వరకూ వెళ్ళాలంటే, గోదావరి జిల్లాలు దాటాలి కదా.? ఆ గోదావరి జిల్లాల ప్రజలేమనుకుంటున్నారు.? ఇది కాస్త ఆలోచించాల్సిన విషయమే. నిజానికి, రాజధాని అమరావతితో ఎవరికీ ఇబ్బంది లేదు.. ఒక్క వైసీపీకి తప్ప.

ఒక రాజధాని అమరావతి అభివృద్ధి చెందితే ఆ తర్వాత ఇంకో రెండేంటి ఖర్మ, ఇరవై రెండు రాజధానులు అదనంగా ఏర్పాటయినా ప్రజలు స్వాగతిస్తారు. వున్నదానికి దిక్కు లేదుగానీ.. వుంచుకోవడానికి మరో ముగ్గురు కావాలన్నాడట వెనకటికి.. అలా తయారైంది పరిస్థితి.